calender_icon.png 28 November, 2024 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలు కావాలంటే.. రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందే..

30-10-2024 01:39:37 AM

  1. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి లంచం డిమాండ్
  2. రూ.3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెడికల్ కాలేజీ ఏవో, జూనియర్ అసిస్టెంట్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాలేజీ అకౌంట్స్ అధికారి కలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ మంగళవారం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి రూ.3 లక్ష లు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ కాలేజీలో విధులు నిర్వహించేందుకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండర్ ద్వారా నియమించారు. వారు 49 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల 9 నెల లు పనిచేస్తే 2 నెలల 15 రోజులకు మాత్రమే వేతనాలు చేశారు. ౪౯ మందిలోనూ 23 మంది క్వాలీఫై కాలేదని విధుల నుంచి తొలగించారు.

తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవడం, పనిచేస్తున్న వారికి మొత్తం వేతనాలు చెల్లించేదుకు ఏవో కలీలుల్లా, జూనియర్ అసిస్టెంట సుధాకర్.. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నుంచి రూ.15 లక్షలు డిమాం డ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని ప్రాదేయపడగా.. రూ.7 లక్షలు చెల్లించేందు కు ఒప్పందం కుదుర్చుకొన్నారు.

అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం మొదటి విడ తగా రూ.3 లక్షలు తీసుకొంటుండగా మంగళవారం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని వివరించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చినట్టు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ పాత్ర?  

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేసిన వారికి వేతనాలు చెల్లించాలన్నా, తొలిగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలన్నా కర్త, కర్మ, క్రియ మొత్తం ప్రిన్సిపాలే. కానీ, ఇక్కడ ఏవో, జూనియర్ అసిస్టెంట్లు ఇంత చేస్తున్నా వారిపై ప్రిన్సిపల్ రాజ్‌కుమార్ ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏవో చేసిన డిమాండ్‌లో ప్రిన్సి పాల్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నా యి. మెడికల్ కాలేజీ ప్రారంభం నుంచి సమస్యల నడుమనే సాగుతోంది. కళాశాల ను నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.