calender_icon.png 19 April, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెరీర్‌లో రాణించాలంటే!

13-04-2025 12:46:23 AM

ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిలో చాలామంది అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీరినే మెంటర్లుగా పిలుస్తుంటారు. జీవితంలో వివిధ దశల్లో మెంటర్‌షిప్ అవసరం. అయితే బాస్, కోచ్, గురువు, సీనియర్, సహోద్యోగి.. ఇలా ఎవరైనా మెంటర్ కావచ్చు. 

ప్రతి ఒక్కరిలో సృజనాత్మకమైన ఆలోచనలు దాగి ఉంటాయి. కాని వాటిని కొంతమంది మాత్రమే సరిగ్గా ఉపయోగించుకుని కెరీర్‌లో రాణిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తమను ఎవరో ఒకరు ప్రేరేపిస్తే కాని తమ సృజనాత్మకతను తెలుసుకోలేరు. ఈ పాత్రను మెంటర్లు పోషిస్తుంటారు. వీరు ఎదుటి వ్యక్తి నైపుణ్యాలను సునిశితంగా పరిశీలిస్తుంటారు. వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేస్తారు. కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తుంటారు. ఇలాంటి మెంటర్లు ఎదుటి వ్యక్తిలోని సృజనాత్మకతను బయటకు తీయడంలో సిద్ధహస్తులు. 

ఆర్థికంగా.. 

కొంతమంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను స్వయంగానే పరిష్కరించుకోగలుగుతారు. కాని ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరైన అవగాహన లేక నష్టపోతుంటారు. ఇలాంటి వారు ఆర్థిక విషయాలపై అవగాహన ఉన్నవారి సలహాలు తీసుకోవచ్చు. వీరికి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఏ సమయంలో ఎలాంటి కొనుగోళ్లు చేయాలి.. వంటి విషయాలపై అవగాహనతో పాటు అనుభవం ఉండే అవకాశం ఉంటుంది. ఒక రకంగా వీరు ఆర్థిక సలహాదారులుగా సహాయపడుతుంటారు. 

అనుభవం..

కొంతమంది ఏ సబ్జెక్టులోనూ నిష్ణాతులు కానప్పటికీ.. వారి అనుభవ పాఠాలు మాత్రం ఇతరులకు ఉపయోగపడుతుంటాయి. అయితే సాధారణంగా ఇలాంటి వారు వయసులో పెద్దవారు కాబట్టి ఇప్పటి తరానికి అనుగుణంగా ఆలోచించలేరని భావించేవారు ఉంటారు. కాని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో వారి అనుభవం సమస్యల పరిష్కారానికి దారి చూపుతుంది.