calender_icon.png 23 October, 2024 | 8:57 AM

బతుకు మారాలంటే.. తెలంగాణ రావాలంటూ!

23-10-2024 12:00:00 AM

సబ్బండ వర్గాలు ఏకమై రాష్ట్ర సాధనకు పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుం డా స్ఫూర్తిని రగిలించి అమరులు ఉద్యమానికి ఊపిరిపోశారు. ‘మా నీళ్లు, మా సంపాదన, మా ఉద్యోగాలు, మా పాలన, మాకంటూ’ 60 ఏండ్ల ఆకాంక్షను ఎలుగెత్తి చాటా రు. జై తెలంగాణ.. అంటూ నినదించి స్వరాష్ట్రాన్ని అందించి తెలంగాణ సిగలో వేగుచుక్కల్లా నిలిచారు. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నల్లగొండ జిల్లాకు చెందిన 27 మంది అమరులయ్యారు. వీరిలో నల్లగొండ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన యువకుడు కట్ట సత్యం ఒకరు. కట్ట రామస్వామి చిన్నకుమారుడు సత్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో సుతారి పనిచేస్తూనే.. మరోవైపు వేదికలపై పాటలు పాడేవాడు. 2002 నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందాడు.

గ్రామంలో ఏ సభ, సమావేశం జరిగినా తెలంగాణ ఆవశ్యకతను స్థానికులకు వివరిస్తూ ఉద్యమం వైపు నడిపాడు. అయితే 2013, ఫిబ్రవరిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మె ల్సీ అభ్యర్థి వరదారెడ్డి నామినేషన్‌కు జనసమీకరణ చేసి నల్లగొండకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు ‘ఇక తెలంగాణ రాదు.. సహకారం సంఘం ఎన్నికల్లోనూ గ్రామానికి చెందిన డైరెక్టర్ గెలవలేదు’ అని విమర్శించారు.

దీంతో మనస్తాపం చెందిన సత్యం ఇంటికి వెళ్లగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం జరుగుతుంది. నా చావుతోనైనా రాష్ట్రం రావాలి’ అంటూ లేఖ రాశాడు. నాటి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చకిలం అనిల్‌కుమార్‌కు ఫోన్ చేసి ‘ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు.. బతకడం వృథా. జైతెలంగాణ.. జైజై తెలంగాణ’ అని నినదిస్తూ గ్రామంలోని మంచినీటి ట్యాంకుపై నుంచి దూకి ఆత్మబలిదానం చేసుకున్నాడు.

త్యాగానికి గుర్తుగా..

ఉద్యమ కారుడు సత్యం అంత్యక్రియలకు అప్పటి శాసనసభ పక్ష ఉపనేత హరీష్‌రావుతో పాటు ఉద్యమకారులు, మేధావులు, ఇతర నేతలు హాజరయ్యారు. సత్యం భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సమీప గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా తరలిరావడంతో నాడు గ్రామం జన సంద్రమైందన్న విషయాన్ని ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సత్యం సోదరుడు యాదగిరికి నాటి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం సైతం అందించింది. సత్యం త్యాగానికి గుర్తుగా గ్రామం నడిబొడ్డున స్థానికులు స్థూపం నిర్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, సత్యం వర్ధంతి రోజుల్లో గ్రామస్తులు, కుటుంబీకులు ఇక్కడ నివాళులర్పిస్తారు.

 రామ్మూర్తి చల్లా,  నల్లగొండ (విజయక్రాంతి)

అమరులను ఆదుకోవాలి

నిరుపేద తెలంగాణ అమరుల కుటుంబాలను నాటి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదు. ఉద్యమకారుల కుటుంబాలకు సాగు భూమి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. ఉద్యమంలో బలిదానం చేసుకున్నవారు మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లే. అమరులందరినీ గుర్తించి వారి కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం సాయం అందించాలి. 

 కట్ట యాదగిరి, 

అమరుడు సత్యం సోదరుడు