06-03-2025 12:00:00 AM
కరోనా కాలం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగి వెండితెరకు తగ్గింది. ఓటీటీ చిత్రాల ద్వారా చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటి అనస్వర రాజన్. ప్రస్తుతం ఆమె నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధమైంది. దీపు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్ హీరోగా నటించారు.
అయితే ఇటీవల అనస్వర రాజన్‌పై దర్శకుడు దీపు పలు ఆరోపణలు చేశారు. తానేమీ తప్పు చేయలేదని అనస్వర రాజన్.. దర్శకుడికి ఓ రేంజ్‌లో ఇచ్చి పడేసింది. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్ట్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఏవో కారణాలతో విడుదల ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితం పలు మీడియా ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు.. అనస్వర అసలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పారు.
అంతేకాకుండా ఆపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై అనస్వర ఒకింత ఘాటుగానే స్పందించింది. “దీపు కరుణాకరన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నాడు. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ నాదే. సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ కూడా చేశాను.
రిలీజ్ డేట్ మార్పుపై నాకెలాంటి సమాచారమూ ఇవ్వలేదు. నాపై ఆరోపణలు గుప్పిస్తూ పరువు తీసేందుకు యత్నిస్తే ఎంత దూరమైనా వెళ్తా” అని అనస్వర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది.