బాలీవుడ్ నటి కరీనా కపూర్ సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్‌మీట్‌లో పాల్గొని తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భర్త, నటుడు సైఫ్ అలీఖాన్‌తో కలిసి వర్క్ చేసిన ‘ఓంకార’ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఓంకార’ నాకు చాలా స్పెషల్ మూవీ. ఒక సవాలుగా తీసుకొని నేను ఆ రోల్ పోషించా. అద్భుతంగా నటించా. సినిమా పూర్తయ్యాక ప్రముఖ దర్శకుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశా. సినిమా చూసేవాళ్లదరూ తప్పకుండా నా యాక్టింగ్‌ను మెచ్చుకుంటారని అనుకున్నా. ఫిల్మ్‌సిటీలో ఏర్పాటుచేసిన స్క్రీనింగ్‌కు చిత్రబృందం హాజరైంది.
ఇంటర్వెల్‌కు సైఫ్ గురించే అందరూ మాట్లాడుకోవటం ప్రారంభించారు. నా వద్దకు వచ్చి.. నువ్వు బాగున్నావ్. సైఫ్ అద్భుతంగా నటించారు అని చెప్పారు. సినిమా పూర్తి కాగానే వాళ్లు నా వద్దకు వచ్చి ‘నువ్వు సూపర్. ఇంతకీ సైఫ్ ఎక్కడ’ అని అడిగారు. ఇదేంటి ఇలా జరిగిందనుకున్నా. నన్ను మెచ్చుకుంటారని వారందరినీ పిలిస్తే.. వాళ్లేమో సైఫ్‌ని మెచ్చుకున్నారు” అంటూ కరీనా నవ్వుతూ ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.