ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ స్కూలులో 8 నుంచి 10వ తరగతి చదువుకుని, తిరిగి ఇంటర్మీడియట్ తెలంగాణలోనే పూర్తి చేసిన అభ్యర్థిని స్థానికుడు కాదని ఎలా అంటారని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ప్రశ్నించింది. నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవలేదన్న కారణంగా అతన్ని స్థానికేతరుడిగా పరిగణించడంపై అసంతప్తి వ్యక్తంచేసింది. ఈ అంశాన్ని ప్రభుత్వమే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించి, విచారణను ౨౭వ తేదీకి వాయిదా వేసింది.
తనను స్థానిక కోటా కింద పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చేవూరి అవినాశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం స్థానికుడిగా పరిగణించలేమని యూనివర్సిటీ తరఫు న్యాయవాది చెప్పడంపై అసంతప్తి వ్యక్తంచేసింది. ఈ అంశాన్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.