calender_icon.png 3 April, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలతో పెట్టుకుంటే.. ఖేల్ ఖతం!

01-04-2025 01:26:43 AM

కేంద్రంతో అమీతుమీకే ఢిల్లీకి: బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి బీసీల మన్నన లు పొందాలని.. లేదూ, బీసీలతో పెట్టుకుంటే ఖేల్ ఖతం దుకాణం బంద్ అవు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. 

కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామని, ఢిల్లీ పాలకుల మెడలు వంచి బీసీ బిల్లును సాధించుకుంటామని చెప్పారు. విద్య, ఉపాధి, రాజకీ య రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు ఏప్రిల్ 2న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన బీసీల పోరుగర్జన మహాధర్నాకు రాష్ట్రం నుంచి ప్రత్యేక రైలులో బీసీ సంక్షేమ సంఘం, ఇతర బీసీ సంఘాల నేతలు వందలాదిగా తరలి వెళ్లారు. సోమవారం ఉదయం 10గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆ ప్రత్యేక రైలును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న 26పార్టీల అధ్యక్షులను ఆహ్వానించామని చెప్పారు. 

మరో మండల్ ఉద్యమం చేస్తాం.. 

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిందని, కేంద్రంలో ద్వంద్వ విధానాలు అవలంబిస్తోందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బీసీలు నిప్పులాంటోళ్లని వారితో పెట్టుకుంటే ఢిల్లీ పాలకుల మెడలు వంచేందుకు జైత్రయాత్ర మొదలు పెడతామని హెచ్చరించారు. ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.

జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నా ఆరంభం మాత్రమేనన్నారు. బీసీల బిల్లు ఎందుకు ఆమోదించరని, వాళ్ల ఓట్లు అవసరం లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.