calender_icon.png 9 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుచేస్తే చిన్న దొరకైనా పెద్ద దొరకైనా శిక్ష తప్పదు

09-11-2024 01:07:28 AM

ఇందిరమ్మ రాజ్యంలో కక్షపూరితంగా వ్యవహరించం: మంత్రి పొంగులేటి

ఖమ్మం, నవంబర్ 8 (విజయక్రాంతి): ‘ఇందిరమ్మ రాజ్యంలో ఎవరి పట్ల ఉద్దేశపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరించం. కానీ  ఏ ఒక్క నాయకుడినో.. పార్టీనో ఇబ్బంది పెట్టం. అయితే తప్పు చేసినవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదిలే ప్రసక్తే లేదు. చిన్న దొరకైనా, పెద్ద దొరకైనా శిక్ష తప్పదు’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 

 పేదోడి ఆస్తులు, డబ్బు, వారి గౌరవాన్ని దోచుకున్న వారిని, పేదోడిని అడ్డుపెట్టుకుని విదేశాల్లోని వారి సంస్థలకు తన తాత సొత్తో.. ఆయన నాయన సొత్తో  పంచుతున్నట్లు పంచి,  తిరిగి టేబుల్ కింద నుంచి సేకరించిన సొమ్ము విషయంలో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇది కేటీఆర్ క్యాప్షన్ అని, ఆయన ఇచ్చిన క్యాప్షన్ ప్రకారమే  చర్యలు ఉంటాయని పొంగులేటి అన్నారు. 

పచ్చ కామెర్లోడికి  లోకమంతా పచ్చగా ఉన్నట్లు  కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు.  బాధ్యాయుతమైన హోదాలో ఉండి ప్రతి దానికి స్పం దించాల్సిన అవసరం తనకు లేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా, కేటీఆర్‌పైన మ్రంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఖమ్మం రూరల్ మం డలం కోట నారాయణపురంలో సమగ్ర కుటుంబ సర్వేని పొంగులేటి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ ఏ ఒక్కర్నీ కక్షపూరితంగా శిక్షించదని అన్నారు. అయితే తప్పు చేసినట్లు తేలితే మాత్రం ఏ వ్యక్తిని వదిలిపెట్టేది లేదన్నారు. తప్పు చేశారో లేదో మీకు మీరు సెల్ప్ సర్టిఫికెట్ ఇచ్చుకుని కూర్చుం టే మాత్రం అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపో తుందన్నారు.

తను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ ప్రశ్నించారు. మీలా తొండాట ఆడాలని  ఇందిరమ్మ రాజ్యానికి లేదని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ రాచరిక పాలనలో ఆనాటి పెద్దలు వారి స్వార్ధం కోసం, స్వలాభం కోసం ఏవైతే  కార్యక్రమాలు చేశారో , ఎవరు చేశారో అటువంటి వారు ప్రజల రాడార్‌లో బుక్కాయ్యారని అన్నారు.

అటువంటి వారు శిక్ష నుంచి త ప్పించుకోలేరని అన్నారు. తాటాకు చప్పులంటూ డప్పాలు కొట్టుకుంటున్నారు.. అసలిప్పుడు తాటాకు చప్పుల్లేవంటూ కౌంటర్ ఇచ్చారు. 

తప్పు చేస్తే జైలుకెళ్ళాల్సిందే 

కేసీఆర్ కుటుంబం తప్పు చేసినట్లు రుజువైతే జైలుకు వెళ్ళాల్సిందేనని పొంగులేటి అన్నారు. ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే కాదు.. కేసీఆర్, కవిత  సైతం  జైలుకు వెళ్ళాల్సి వస్తే వెళతారని అన్నారు.

గుమ్మడికాయ దొంగ ఎవరంటే, కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేస్ అంశంలో  రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.  కేసీఆర్ కుటుంబానికి  ఇన్ని కోట్ల సంపద  ఎక్కడి నుంచి వచ్చిందో  తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు. 

చాలెంజ్ చేస్తున్నా నేను కాంట్రాక్టులు తీసుకోలేదు 

 మంత్రులుగా ఉన్న వారు కాంట్రాక్టులు తీసుకోకూడదు అన్న నిబంధన నాకైనా ఇంకెవరికైనా ఒక్కటేనని సమాధానం ఇచ్చారు. రాఘవ క్రన్సస్ట్రక్షన్స్ కంపెనీకి అమృత్ కాంట్రాక్టు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై పొంగులేటి  ఘాటు గా స్పందించారు. ఈ విషయంలో ఆరోపణలు చేస్తున్న వారికి సిగ్గుండాలని, ఈ విషయంలో చాలెంజ్ చేస్తున్నానని అన్నారు. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.

మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తే పెడతాం 

మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి రెడ్ కార్పెట్ పర్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయమై ఆయన ఘాటుగా స్పందిస్తూ  మేఘా కృష్ణారెడ్డి కంపెనీ తప్పు చేసినట్లు తేలితే ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని, తప్పు చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో చట్టం నియమ నిబంధనలు ప్రకారం నడుచుకోవడం జరుగుతుందన్నారు.