23-03-2025 12:00:00 AM
ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది అంటూ చాలామంది నిద్రని తేలిగ్గా తీసుకుంటారు. శారీరక ఆరోగ్యం బాగుండాలంటే చక్కని ఆహార నియమాలు పాటిస్తూ, మంచి వ్యాయామం చేస్తే చాలనుకుంటారు. కానీ వీటితో పాటు మంచి నిద్రకూడా ముఖ్యమంటున్నది అధ్యయనం. కువైట్‌లోని డాస్‌మేన్ డయాబెటిస్ ఇన్‌స్టి ట్యూట్ విశ్రాంతికి, దీర్ఘకాలిక వ్యాధులకూ ఉండే సంబంధంపైన పరిశోధన చేసింది.
మనం నిద్ర పోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామేమో అనుకుంటుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్ అనే హార్మోన్‌ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ఒక్కరోజే కదా అని సర్దిచెప్పుకుంటూ మనం పదేపదే నిద్రకు దూరమవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా జమవుతూ చివరికి శరీరంలో కొన్ని వాపులకి కారణం అవుతుంది.
మరోపక్క నిద్రలేమితో కణాలు శక్తిని కోల్పోయి.. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని కోల్పోతాయి. ఈ పరిస్థితి పదేపదే కొనసాగితే.. శరీరం మోనోకైట్స్ అనే వ్యాధినిరోధక కణాలని విడుదల చేస్తుంది. ఇది గుండెజబ్బులతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. అందుకే సాకులు చెప్పకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.