calender_icon.png 14 October, 2024 | 5:51 AM

ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి ఉపాధికి పోతే ఊపిరి పాయె!

14-10-2024 03:00:57 AM

దయనీయంగా గల్ఫ్ కార్మికుల పరిస్థితి

నెలకు16 మంది ప్రాణాలు పోతున్నయ్

  1. 2023 డిసెంబర్ 7 నుంచి 160 మంది మృతి
  2. వీరి కుటుంబాలకు ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా
  3. అంతకుముందు పదేళ్లలో 2 వేల మంది మృతి 
  4. వారినీ ఆదుకోవాలని బాధిత కుటుంబాల వినతి
  5. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యం
  6. ఈసీఆర్ జాబితాలో లేని దేశాల బాధితులకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వేడుకోలు 

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు మనిషికి ఉన్న ఊరిని, కన్నవారిని, భార్యాపిల్లలను విడిచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కల్పిస్తాయి. అలా ఉద్యోగాల కోసం విదేశాల బాట పట్టిన కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారెందరో. క్షేమంగానే తిరిగి వస్తారని కొండంత ఆశతో ఎదురుచూసే కుటుంబం.. కుటుంబాన్ని వదిలి జీవనోపాధి కోసం కార్మికుల తండ్లాట. ఇదిలా ఉండగా జీవనోపాధి కోసం దేశం కానీ దేశం పోతే జీవమే పోయిన సందర్భాలెన్నో ఉన్నాయి.

అలాంటి ఘటనలతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలు ఎన్నో తెలంగాణలో ఉన్నాయి. వందలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించడంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తుంది.

అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీని కోసం రూ.10.60 కోట్ల నిధులను కూడా విడుదల చేసి గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అర్హులైన కార్మికుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

నెలకు 16 మంది మృతి..

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను వెల్లడించింది. ఇందులో ప్రధానమైనది 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన కార్మికులకు మాత్రమే ఇది వర్తింస్తుందనే నిబంధన. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గత పది నెలల్లో దాదాపు 160 మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించారు.

అంటే సరాసరిన నెలకు 16 మంది వరకు మరణించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రూ.10.60 కోట్లు సుమారు 200 మందికిపైగా బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం మరణించిన 160 బాధిత కుటుంబాలకే కాకుండా ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి.

భవిష్యత్‌లోనూ ప్రమాదవశాత్తు ఏవైనా ఘటనలు సంభవించినప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే అదనంగా నిధులను విడుదల చేసింది. దీంతో గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తున్నది. 

పంపిణీ బాధ్యత కలెక్టర్లదే..

ఎక్స్‌గ్రేషియా పంపిణీ విషయంలో బాధితులకు ఇబ్బందులకు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం రంగ సిద్ధం చేసింది. ఎక్స్‌గ్రేషియా పంపిణీకి సంబంధించిన పూర్తి బాధ్యతలను కలెక్టర్లకే అప్పగించింది. దరఖాస్తు చేసుకోవడం, ఎక్స్‌గ్రేషియా కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటుంది.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎక్స్‌గ్రేషియా పొందేందుకు అన్ని అర్హతలు ఉంటే వెంటనే నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. అర్హులైన వారికి 5 నిమిషాల్లోనే నగదు బదిలీ అవుతుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే లబ్ధి చేకూరుతుండటంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

 గత పదేళ్లలో 2 వేలకుపైగా..

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్ 7 తర్వాత మరణిస్తేనే ఈ ఎక్స్‌గ్రేషియా అందుతుందనే నిబంధనతో గతంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గత పరిస్థితులను గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు సంబంధించి 1,500 మంది కార్మికుల వరకు గల్ఫ్ దేశాల్లో మరణించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్ల లో 2 వేలకు పైగానే కార్మికులు మరణించారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన నేపథ్యంలో వీరందరూ ఎక్స్‌గ్రేషియా పొందేందుకు అనర్హులు అవుతారు. దీంతో 2023 డిసెంబర్ 7 కంటే ముందు గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణంతో చిన్నాభిన్నమైన కుటుంబాలను ప్రభుత్వమే పెద్దమనసుతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం.. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు మొత్తంగా దాదాపు 3,500 మందికి పైగా గల్ఫ్ దేశాల్లో కార్మికులు మరణించారు. వీరికి ఉమ్మడి ఏపీలో న్యాయం జరగలేదు. కనీసం తెలంగాణ ఏర్పాటయ్యాకైనా న్యాయం జరుతుందని ఎదురు చూసిన కార్మికుల కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణితో గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి కేవలం మాటలకే పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో గతంలోని బాధిత కుటుంబాలను కూడా ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఈసీఆర్ దేశాలను జాబితాలో చేర్చాలి

ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా కేవలం 7 గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అందులో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ దేశాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుండటంతో ఇతర దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) దేశాల్లోనూ జీవనోపాధి కోసం వేలాది మంది కార్మికులు వెళ్తున్నారు. వారికి ఈ ఎక్స్‌గ్రేషియా వర్తించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 7 దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యమెన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు ఈసీఆర్ దేశాల జాబితాలో ఉన్నాయి.

వీటితోపాటు సింగపూర్, ఇజ్రాయెల్, కాంబోడియా, రష్యా, ఉక్రెయిన్, మాల్దీవ్స్ వంటి దేశాలకు కూడా తెలంగాణ నుంచి కార్మికులు ఉపాధి కోసం వెళ్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఎక్స్‌గ్రేషియా పథకాన్ని ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రవాసీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదారతతో వ్యవహరించాలని కోరుతున్నారు. నిబంధనలు సడలించి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

వారి కోసమూ ప్రతిపాదనలు పంపాం 

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకే ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. అయితే 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, అంతకుముందు మరణించిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో రూ. 1 లక్ష ఎక్స్‌గ్రేషియా అందించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి కూడా ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటాం.

 మంత్రి పొన్నం ప్రభాకర్

3 లక్షలు పంపిస్తే 2 నెల్లకు డెడ్ బాడీ వచ్చింది.. 

 ‘నా భర్త 2022లో సౌదీలో మరణించారు. ఇక్కడ నుంచి అప్పుచేసి మరీ రూ.3 లక్షల పంపిస్తేనే నా భర్త మృతదేహం ఇక్కడకు వచ్చింది. అది కూడా రెండు నెలల తర్వాత వచ్చింది. అప్పటి వరకు రూ.5 లక్షల అప్పు అయింది. మాకు ముగ్గురు పిల్లలు. అందరూ చిన్నోళ్లే. వారిని చదివించే స్థోమత నాకు లేదు. సీఎం రేవంత్‌రెడ్డి సారు దయ చూపాలి. పిల్లలకు చదువులకు ప్రభుత్వమే సాయం చేసి ఆదుకోవాలి’ అని నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాఫ్రాపూర్‌కు చెందిన తొండకురి రాజవ్వ తమ బాధను పంచుకున్నారు. 

 తొండకురి రాజవ్వ, సౌదీలో మరణించిన సాయన్న భార్య

ఉన్న ఒక్క కొడుకు చనిపోయిండు 

‘దుబాయిలో ఉద్యోగం చేస్తా అని పోయి ఉన్న ఒక్క కొడుకు చనిపోయిం డు. నా కొడుక్కు భార్య, ఒక చిన్న పాప ఉంది. కొడుకు పోవడంతో మాకు మగ దిక్కు లేకుండా పోయింది. మాకు ఏం ఆధారం లేదు. 2 లక్షల అప్పు ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పైసలతో అప్పులు తీరుతయి.

ఇంకా మనువరాలికైనా ఎంతో కొంత అక్కరకు వస్తాయి. ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి సారుకు ధన్యవాదాలు. ఎక్స్‌గ్రేషియా పైసల్ వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం’ అని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్లకు చెందిన బొనగిరి సాంబ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. తిరుమలేశ్ 2024 మార్చి లో దుబాయ్ లో మరణించారు. 

 బొనగిరి సాంబలక్ష్మి, దుబాయ్‌లో మృతిచెందిన తిరుమలేశ్ తల్లి

నా భర్తను కడసారి కూడా చూసుకోలేదు.. 

‘నా భర్త 2019లో పని కోసం ఒమన్ దేశానికి వెళ్లారు. 2020లో చనిపోయారు. నా భర్తను కడసారి చూసుకునేందుకు మృతదేహం కూడా ఇక్కడికి రాలేదు. అక్కడే దహనం చేశారు. మాకు ఇద్దరు కూతుర్లు. మాకు భూములు, ఆస్తులు కూడా లేవు. కూలీ పని చేసుకుంటేనే పూట గడుస్తుంది. పిల్లల ముఖం చూసైనా మమ్మల్ని ఆదుకోవాలి. కుటుంబ పెద్దను కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం మాపై దయ చూపాలి’అని కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని మోటపల్లి గ్రామానికి చెందిన కునారపు లక్ష్మిఆవేదన వ్యక్తం చేశారు. 

  కునారపు లక్ష్మీ, ఒమన్ దేశంలో మరణించిన మల్లేశ్ భార్య

గరీబోళ్లం.. ఎక్స్‌గ్రేషియాతోనే పిల్లల భవిష్యత్ 

‘మేము చాలా గరీబోళ్లం. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కిరాయికి ఉంటున్నం. పిల్లలు చిన్నవాళ్లు. బాకీలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సంతోషం. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న దానితో పిల్లల జీవితాలైనా కొంతవరకు బాగుపడతాయి. తమలాంటి వాళ్లను ఆదుకుంటున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన బోగు వనిత అన్నా రు. బోగు లక్ష్మణ్ 2024 జూలైలో దుబాయ్‌లో చనిపోయారు. 

 బోగు వనిత, 

దుబాయ్‌లో మరణించిన 

లక్ష్మణ్ భార్య