- ఏ గ్రామ కార్యాదర్శి ఆ గ్రామంలోనే ఉండాలి
- వారం రోజుల్లో ఈ రూల్ అమలు కావాలి
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలో పనిచేసే కార్యదర్శి అదే గ్రామంలో నివాసం ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయశాఖ ఏఈవోలకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టంచేశారు. వచ్చే సోమవారం నాటికి ఈ రూల్ అమలు కావాలని తేల్చి చెప్పారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపుంరలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఖరీఫ్ పంటల సాగు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిద్రలేచింది మొదలు పనిలో నిమగ్నమవ్వాలని పీఎస్‌లకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఏ గ్రామంలో పనిచేస్తున్నారో అక్కడే నివాసం ఉంటేనే గ్రామంలో సమస్యలు, స్థానిక స్థితిగతులపై పట్టు ఉంటుందని అన్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న పలు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదుల అందాయని, మొదటి తప్పుగా మందలించి వదిలేస్తున్నామని అన్నారు. మళ్లీ పునరావృతమైతే శాఖాపరమైన చర్యలకు పూనుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వ్యవసాయశాఖ ఏఈవోలు కూడా వారు పనిచేస్తున్న క్లస్టర్ పరిధిలోనే ఉండాలని ఆదేశించారు. ఓ గ్రామంలో నివాసం ఉంటూ మరో గ్రామంలో, మండలంలో పనిచేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. తక్షణమే వారు పనిచేస్తున్న గ్రామాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. కొంతమంది సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి పాఠశాలలకు 200 మీటర్ల లోపు కూడా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారని, వాటి వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జడ్పీసీఈవో ,డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఆరెకోడు, ఆరెకోడు తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. తల్లంపాడు నుంచి పైనంపల్లి వరకు ఉన్న ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.