calender_icon.png 22 September, 2024 | 2:56 AM

గణేశ్ పూజకు వెళ్తే కులం పేరుతో దూషించారు

16-09-2024 04:18:56 AM

  1. మాపై దాడికి యత్నించారు 
  2. దళిత మహిళల ఆరోపణ 
  3. మెదక్ జిల్లా శమ్నాపూర్‌లో ఘటన

మెదక్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గణేశ్ మండపంలో పూజలు చేయడానికి వెళ్లిన తమను నిర్వాహకులు అడ్డుకొని కులం పేరుతో దుర్భాషలాడారని దళిత మహిళలు ఆరోపించారు. తమపై దాడికి యత్నించారని తెలిపారు. వివరాలిలా ఉన్నా యి.. మెదక్ జిల్లా హవేళీ ఘణపూర్ మండ లం శమ్నాపూర్ గ్రామంలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్మాట భాగ్యమ్మ, ఆమె కూతురు అంజలి కలిసి వినాయకుడికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన నిర్వా హకులు తిరుపతిరెడ్డి, యాదవరెడ్డి, పట్నం చంద్రశేఖర్ అడ్డుకొని కులం పేరుతో దుర్భాషలాడారని ఆరోపించారు.

ఈ విషయంపై భాగ్యమ్మ భర్త సిద్దిరాములు ప్రశ్నించడానికి వెళ్లగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పీ శంకర్, మానవ హక్కుల వేదిక బృందం ఆదివారం గ్రామాన్ని సందర్శించి నిజనిర్ధారణ చేపట్టారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైల పడతాడా అని ప్రశ్నించారు. వారితో అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాము మహిళల ను దూషించలేదని, దాడి చేయలేదని, వారే తమను అకారణంగా దూషించారని నిర్వాహకులు దళిత మహిళలపై కౌంటర్ కేసు పెట్టారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

కాగా, కులం పేరుతో దూషించి దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో హవేళీ ఘణపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, బాధితులపై అక్రమంగా బనాయించిన కౌంటర్ కేసులను వెంటనే ఎత్తివేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను డీబీఎఫ్ నేతలు కలిసి చర్యలు తీసుకోవాలని కోరగా, సోమవారం గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు అహ్మద్, డీబీఎఫ్ జిల్లా  అధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా కార్యదర్శి హన్మకొండ దయాసాగర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రవి తదితరులు పాల్గొన్నారు.