- వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
- ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట బాధితుల ఆందోళన
హనుమకొండ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): హనుమకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ రమాదేవి అనే మహిళ గురువారం మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యతోనే ఆమె చనిపోయిందంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా ప్రగతి సింగారానికి చెందిన చిలుకల రమాదేవి (40) రెండు నెలలుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం ఆమెను కొద్దిరోజుల కిందట హనుమకొండ ములుగురోడ్‌లోని అజార హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చెయ్యాలంటూ సూచించారు.
దీంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేశారు. కాగా, బుధవారం రమాదేవి శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది పడింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐసీయూలోకి మార్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం రమాదేవి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే రమాదేవి మృతి చెందిందంటూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చెప్పినా నర్సులు పట్టించుకోలేదని ఆరోపించారు. సర్జరీ చేసిన డాక్టర్లు సమయానికి రాకపోవడం కారణంగానే మృతిచెందిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అజార ఆస్పత్రి వైద్యులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.