calender_icon.png 16 January, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాశకు పోతే ఖాతా ఖాళీ

08-08-2024 03:36:14 AM

  1. పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలు
  2. అధిక డబ్బు వస్తుందని ఆశ చూపి కోట్లు కొల్లగొడుతున్న నేరగాళ్లు 
  3. ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు స్వాహా
  4. ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసుల నమోదు 
  5. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా తగ్గని నేరాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రజల అమాయకత్వం, అత్యాశ వారికి అవకాశంగా మారింది. పెట్టిన పెట్టుబడులకు అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజలను నిండా ముంచుతున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజలు అత్యాశకు పోయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు.

సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఫెడెక్స్ పార్సిళ్లలో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తూ, స్టాక్ ట్రేడింగ్‌లో మెళకువలు నేర్పి స్తామంటూ, బీమా పాలసీల రెన్యూవల్ పేరుతో సం దేశాలు, ఏపీకే ఫైల్స్ వంటివి పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ట్రాయ్, ముంబై పోలీసు, సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ ఫోన్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 2022 సంవత్సరంలో మొత్తం 2,862 కేసులు నమోదు కాగా, 2023 జూలై వరకు సుమారు 1,600 కేసులు నమోదైనట్లు సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత తెలిపారు. గతేడాది సైబర్ నేరగాళ్లు  రూ.187 కోట్లు దోచుకున్నారని, అందులో రూ.30 కోట్ల వరకు సైబర్ నేరస్థుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసి బాధితులకు తిరిగి చెల్లించామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు రూ.141 కోట్లు సైబర్ ఫ్రాడ్ జరిగిందని, అందులో రూ.41 కోట్లు సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేశామని పేర్కొన్నారు.  సైబర్ మోసాల బారిన పడుతున్న వారిలో ముఖ్యంగా రిటైర్డ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, గృహిణిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు.

బీమా పాలసీల డేటా కొనుగోలు చేసి  

బీమా వివరాలు, వాటి గడువు, ఇతరత్రా సమాచారం కేవలం పాలసీదారులకు, బీమా సంస్థలకు మాత్రమే తెలుస్తాయి. సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేస్తున్నారు. డేటా ప్రొవైడర్లు, బ్రోకింగ్ కంపెనీలు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు ఇస్తే లక్షలాది మంది బీమా వివరాలను అందిస్తున్నాయి. ఇందులో పాలసీదారుల వివరాలు, వాటి గడువు, వాహనాల నంబర్లు, వాటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా పూర్తిగా వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు పాలసీదారులకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి కొత్త బీమా, రెన్యూవల్ పేరుతో అధిక లాభాలు, బహుమతులు అందుకోవచ్చని నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. వీటితో వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. 

అమ్మాయిల నగ్న వీడియోలతో ఏపీకే ఫైల్స్..

తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. చిన్నాపెద్ద వయసు తేడా లేకుండా పురుషులను సైబర్ ఉచ్చులో దింపడానికి అమ్మాయిల నగ్న వీడియోలతో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. అవి చూసిన కొందరు వాటిపై క్లిక్ చేయడంతో వారికి తెలియకుండానే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. తద్వారా తమ వ్యక్తిగత వివరాలు నేరుగా సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతున్నాయి. అనంతరం వారి వివరాలతో బాధితులకు ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడి అందినంతా దోచుకుంటున్నారు.  

నేరాలపై ఫిర్యాదు చేయాలంటే..

సైబర్ క్రైమ్‌లో కోల్పోయిన మొత్తం రూ. లక్ష కంటే ఎక్కువగా ఉంటే సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో.. రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చని డీసీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగినట్లు బాధితులు గుర్తిస్తే గంటలోపు (గోల్డెన్ అవర్) cybercrime. gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చని, టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. 

ఇటీవల చోటుచేసుకున్న సైబర్ నేరాలు

*  నగరానికి చెందిన ఓ వ్యక్తికి ట్రేడింగ్‌లో మెళుకువలు నేర్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు రూ. 38 లక్షలు కాజేశారు. 

*  మీ వివరాలతో కూడిన ఇండియా నుంచి ఇరాన్ పంపిస్తున్న ఫెడెక్స్ కొరియర్ పార్సిల్‌లో మాదక ద్రవ్యా లు సరఫరా చేస్తున్నారని, వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని, మీ పై ఎలాంటి కేసు నమోదు కాకుండా ఉండాలంటే ముంబాయి కస్టమ్స్ అధికారులతో మాట్లాడాలని బాధితుడిని భయభ్రాంతులకు గురి చేసి రూ. 14 లక్షలు లూటీ చేశారు.

* సికింద్రాబాద్‌కు చెందిన  ఓ ప్రభుత్వ ఉద్యోగిని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో రిటర్న్‌లు వస్తాయని నమ్మించి రూ.13.17 లక్షలు దోచుకున్నారు.

గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి.. 

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. డబ్బు కోల్పోయిన గంటలోపు ఫిర్యాదు చేస్తే నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిం చేందుకు ప్రతి బుధవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో కొత్త గ్రూపుల్లో జాయిన్ కావొద్దు.  అదేవిధంగా కొత్త నంబర్ల నుంచి వీడియో, స్కైప్ కాల్స్‌ను స్వీకరించొద్దు.  

 దార కవిత, సైబర్ క్రైమ్ డీసీపీ