- సంప్రదాయ ఆహార పదార్థాల స్థానంలో ఫాస్ట్‌ఫుడ్స్ ప్రత్యక్షం
- చూడగానే ఆకట్టుకునేలా ఫుడ్ కలర్స్ వినియోగం
- రుచిగా ఉండేందుకు మోతాదుకు మించి టేస్టింగ్ సాల్ట్
- తిని బాధితులుగా మారుతున్న ప్రజలు
- తూతూమంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- కఠిన చర్యలు లేకపోవడంతో చెలరేగిపోతున్న వ్యాపారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లలో పెద్ద ఎత్తున మార్పు లు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక, సంప్రదాయ ఆహార పదార్థాల స్థానంలో ఫాస్ట్ ఫుడ్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇంకేముంది నగర రోడ్లపై ఎక్కడ చూసినా ఆకర్షించేలా తినుబండారాలు దర్శనమిస్తున్నాయి.
భోజన ప్రియు లకు మరింత టేస్ట్ అందించేందుకు టేస్టింగ్ సాల్ట్‌తో వండిన వంటకాలు అడుగడుగునా అందుబాటులోకి వచ్చాయి. రంగులు కలిపి తయారు చేసిన స్ట్రీట్ ఫుడ్, కల్తీ ఆహార పదార్థాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇలా స్ట్రీట్ ఫుడ్‌కు మంచి డిమాండ్ ఉంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు టెంప్ట్ చేస్తుండటంతో వీటిని చాలామంది ఇష్టంగా తింటున్నారు.
ఫలితంగా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ ఫెయిల్యూర్ వం టి రోగాల బారిన పడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. లాభార్జనే ధ్యేయం గా వ్యాపారు లు కల్తీ తినుబండారాలను విక్రయించి ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతు న్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, అతి తక్కువ మొత్తంలో జరిమానాలు విధిస్తుండడంతో వ్యాపారుల్లో మా ర్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.
లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం
కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా నాసిరకం వస్తువులు, కుళ్లిపోయిన పదార్థాలు, కల్తీ వంట సామగ్రి వంటి వాటితో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తుండటంతో వాటిని తింటున్న ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. తినుబండారాల్లో వినియోగించే వస్తువులను తక్కువ ధరల్లో కొనుగోలు చేసి వాటిల్లో టేస్ట్ కోసం రకరకాల విష పదార్థాలు (ఫుడ్ కలర్, నాసిరకం ఆయిల్ తదితరాలు ) కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన విక్రయించే పదార్థాల్లోనే ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పుట్టగొడుగుల్లా..
ప్రస్తుతం నగరంలో ఏ గల్లీలో చూసినా తినుబండారాల దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉద యం టిఫిన్స్ నుంచి మొదలుకొని మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రివేళల్లో డిన్నర్ ఇలా ప్రతిదీ విక్రయిస్తున్నారు. వీటి ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవస రం లేకపోవడం, ఎలా వండి వడ్డించినా అడిగే నాథుడు లేకపోవడంతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు.
తక్కువ ధరతో వంట సరకులు కొనుగోలు చేసి, వాటితో నోరూరించేలా వంటకాలు సిద్ధం చేసి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కాకుండా జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించడంతో పాటు తినుబండారాలు విక్రయిం చే దుకాణదారులకు లైసెన్స్ తప్పనిసరి చేసి, కల్తీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టేలా నిబంధనలకు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఒకే ఒక మొబైల్ ల్యాబ్
సుమారు కోటికి పైగా జనాభా కలిగిన జీహెచ్‌ఎంసీలో ఒకే ఒక మొబైల్ ల్యాబ్ ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం ఆరు జోన్లు, 30 సర్కిళ్లలో రోజుకో జోన్ చొప్పున ఆరు జోన్లలోని నిర్ణీత ప్రాంతాల్లో స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారుల నేతృత్వంలో పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4,500 వరకు నాణ్యత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.
అలాగే, నాణ్యత లేని పదార్థాలు వినియోగించవద్దని 2022 నుంచి ఇప్పటివరకు 300కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరీక్షల్లో నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే నామమాత్రపు జరిమానా విధిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘనకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తుండటం, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు కల్తీ ఆపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొన్న బంజారాహిల్స్.. తాజాగా అల్వాల్‌లో
* బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో గత నెల 25న జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం(29)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 60 మంది వాటిని తిన్నారు.
వీరందరికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆసుపత్రుల్లో చేరారు. రేష్మ బేగం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
* అల్వాల్ లోతుకుంటలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గత నెలలో షవర్మ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దానిని మూసేస్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ, వారం రోజుల నుంచి సాయంత్రం వేళల్లో తిరిగి తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజాగా, బుధవారం సూర్యనగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు షవర్మ తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఏడాది నగరంలో ఇలాంటి ఘటన మూడోసారి చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.