- కమర్షియల్ ట్యాక్స్‌లో వింత పోకడ
- పదోన్నతి ఆపేలా రికమెండ్ చేయాలి
- ఉన్నతాధికారులకు జేసీ స్థాయి ఆఫీసర్ వేడుకోలు
- సహకరించేది లేదన్న పలువురు సీనియర్ ఆఫీసర్స్
- వసూళ్లు బాగుండటం వల్లే కదలడం లేదన్న ప్రచారం
- జాయింట్ కమిషనర్ దారిలోనే మరికొందరు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల విభాగంలో వింత పోకడ నెలకొంది. సాధారణంగా ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా పదోన్నతిని కోరుకుంటాడు. కానీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని పలువురు అ ధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రు.
తమకు ప్రమోషన్స్ వద్దే వద్దు అంటున్నారు. డివిజన్లలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు ఉన్నచోట నుంచి కదిలేందుకు అస్స లే ఇష్టపడటం లేదు. తాజాగా ఓ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి తనకు ప్రమోషన్ ఆపేలా రికమెండ్ చేయాలని వాణిజ్యశాఖలోని ఉన్నతాధికారులకు లేఖలు రాయడం ఇప్పుడు సంచల నంగా మారింది.
గతంలో ఇదే విషయాన్ని విజయక్రాంతి ప్రచురించింది. వసూళ్లకు అలవాటు పడిన కొందరు ఆఫీసర్లు తమకు ప్రమోషన్స్ వద్దంటున్నారని అందులో రాసుకొచ్చింది. ఇప్పు డు అవే వాస్తవాలు అవుతున్నాయి.
వెళ్లను అంటే వెళ్లను..
హైదరాబాద్‌లోని ఒక డివిజన్‌లో పనిచేస్తున్న ఓ జాయింట్ కమిషనర్ ప్రమోషన్స్ వచ్చే జాబితాలో ఉన్నారు. ఆ అధికారికి జేసీ నుంచి అడి షనల్ కమిషనర్‌గా పదోన్నతి రావాల్సి ఉంది. అయితే తనకు అడిషనల్ కమిషనర్ పదవి వద్దని ఆ ఆఫీసర్ అంటున్నారు. తనను ప్రస్తుతం పనిచేస్తున్న డివిజన్‌లోనే ఉంచాలని, అక్కడి నుంచి కది లించొద్దని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
తన ప్రమోషన్‌ను ఆపేందుకు సహకరిం చాలని వాణిజ్య పన్నుల విభాగం ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఆయన లేఖలు రాశారు. వాటిపై సంతకాలు చేసి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇందుకు పలువురు ఆఫీసర్లు ససేమీరా అంటున్నారు.
తొందరపడి ఇప్పుడు సంత కాలు చేస్తే భవిష్యత్‌లో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అయితే కొందరు అధికారులు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఉద్యోగం ఏదైనా సీనియార్టీని బట్టి ప్రమో షన్స్, బదిలీలు ఉంటాయి. అవన్నీ తనకు వర్తింపజేయొద్దని ఆ జేసీ స్థాయి అధికారి వేడుకోవ డం విస్మయానికి గురి చేస్తోంది.
భారీగా ఆమ్యామ్యాలు..
సదరు జేసీ స్థాయి అధికారికి డివిజన్ ఆఫీస్‌లో భారీగా ఆమ్యామ్యాలు ముట్టుతున్నట్లు సమాచారం. వసూళ్లు బాగున్నాయనే అక్కడి నుంచి కదిలేందుకు ఇష్టపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేసీకి అడిషనల్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇస్తే హెడ్డాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. డివిజన్ కార్యాలయంలో జేసీనే బాస్.
కానీ హెడ్డాఫీస్‌లో కమిషనర్‌తో పాటు ఇద్దరు అడిషనల్ కమిషనర్లు, పలువురు జేసీలు ఉంటారు. డివిజన్ ఆఫీసులో ఉన్నంత ఆమ్దానీ హెడ్డాఫీస్‌లో ఉండదన్న అభిప్రాయం వల్లే పదోన్నతిని వద్దంటున్నట్లు తెలుస్తోంది. ఇలా జేసీస్థాయి అధికారి మాదిరిగానే మరికొందరు అధికారులు కొన్నేళ్లుగా డివిజన్ ఆఫీసుల్లో తిష్టవేసి..
రిమోట్ ఏరియాలకు, ఆమ్దానీ తక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు మొండికేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి అధికారుల తీరు వల్ల ప్రమోషన్స్ ఆలస్యం కావడం, అలాగే ఉద్యోగోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఇతర ఆఫీసర్లకు ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.