calender_icon.png 26 April, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడి, పొడి చెత్త వేరు చేయకుంటే తీసుకోం

26-04-2025 12:02:20 AM

హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

హుస్నాబాద్, ఏప్రిల్ 25 :  తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వకపోతే ఇకపై తీసుకోబోమని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు చెత్త విభజనపై అవగాహన కల్పించేందుకు ముమ్మరంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం 16వ వార్డులోని రావుస్ కాలనీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు. ప్రతి ఇంటికీ తిరిగి చెత్త విభజన ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి బృందంలో వార్డు అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సూపర్వైజర్తో కలిపి 11 మంది సభ్యులున్నారని వివరించారు. ఈ బృందాలు ప్రతిరోజూ 25 నుంచి 30 ఇండ్లను సందర్శించి కర పత్రాలు అందజేస్తూ, చెత్తను ఎలా వేరు చేయాలో వివరిస్తున్నాయన్నారు.

మొదటి రోజు మున్సిపల్ సిబ్బంది స్వయంగా ఇంటి యజమానుల సమక్షంలో చెత్తను వేరు చేసి అవగాహన కల్పి స్తారన్నారు. రెండో రోజు కూడా చెత్త వేరు చేయకపోతే, వారి ఇంటి ముందే వారితోనే వేరు చేయిస్తామని  చెప్పారు. చెత్తను వేరు చేసి ఇవ్వని వారి నుంచి చెత్తను తీసుకోకూడదని శానిటేషన్ సిబ్బందికి  ఆదేశాలు జారీ చేశామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 40 శాతానికి పైగా చెత్త విభజన జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, మె ప్మా ఆర్పీలు సృజన, సరిత, లావణ్య, స్వర్ణలత, పద్మ, జవాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.