- పంచాయతీలకు షో రూం యజమానుల నోటీసులు
- నిర్మల్ జిల్లాలో చెత్త సేకరణ టాక్టర్ల బకాయిలు రూ.65 లక్షలు
నిర్మల్, జనవరి ౯ (విజయక్రాంతి): పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కోనుగోలు చేసిన చెత్త సేకరణ ట్రాక్టర్ల బకాయిల పంచాయితీ ముదిరింది. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా ట్రాక్టర్ల కొనుగోలుకు సం బంధించి కిస్తీలు చెల్లించకపోవడంతో టాక్టర్లను జప్తు చేస్తామంటూ షోరూం యజమా నులు పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
దీంతో నిర్మల్ జిల్లా అధికారుల్లో కలవరం సృష్టిస్తున్నది. లీడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో షోరూంల యజమానులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆరు నెలల నుంచి సంప్రదింపులకే పరిమితమవుతున్నారని బకాయిలు చెల్లించడం లేదని యజమానులు తెలిపారు.
రూ.65 లక్షల బకాయిలు
నిర్మల్ జిల్లాలోని 2021-22 సంవత్సరంలో ప్రభుత్వ గ్యారంటీ కింద టాక్టర్లు మంజూరు చేసింది. జీరో ఆడ్వాన్స్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనాలని అప్పట్లో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. జిల్లా మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా 396 ట్రాక్టర్లను లీడ్ బ్యాంక్ అధికారుల ప్రోత్సాహంతో కిస్తీల రూపంలో చెల్లిం చే విధంగా టాక్టర్లు కొన్నారు.
కొన్ని నెలల వరకు కిస్తీలు చెల్లించినా.. ఆ తర్వాత ఎన్నికలు రావడం, బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అంతా తలకిందులైంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటం, ప్రభుత్వాలు ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో కిస్తీల చెల్లింపు నిలిచి పోయాయి. నిర్మల్ జిల్లాలో 92 పంచాయతీల్లో ట్రాక్టర్ల కిస్తీల బకాయిలు పేరుకుపో యాయి.
మొత్తం రూ.65 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ బకాయి ఏడాది క్రితమే చెల్లించా ల్సి ఉండగా నిధులు లేమితో చెల్లించకపోవడంతో వడ్డీ వేయడంతో మరింత భారం పడుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆలోపే బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు, షో రూ ం యజమానులు ఒత్తిడి తెస్తున్నారు.
నిధులు రాగానే చెల్లిస్తాం
జిల్లాలో ట్రాక్టర్‌ల కిస్తీలు బకాయిలు ఉన్న మాట నిజమే. నిధుల కొరత కారణంగా చెల్లింపులో ఆలస్యమవుతున్నది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న పంచాయతీల కిస్తీలు చెల్లించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే మిగిలిన బకాయిలు చెల్లిస్తాం.
శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్
తీవ్ర ఒత్తిడి ఉంది
నిర్మల్ జిల్లాలో బ్యాంకు గ్యారంటీ కింద అధికారుల ఆదేశాల మేరకు వివిధ వివిధ బ్యాంకుల ద్వారా 396 పంచాయతీలకు టాక్టర్ రుణాలు ఇచ్చాం. ఇప్పటికి జిల్లాలో 92 టాక్టర్ల కిస్తీలు రూ.65 లక్షలు బకాయి ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక బకాయిలు చెల్లించడంలేదు.
ఉన్నతాధికారుల నుంచి బాకాయిల చెల్లింపుల కోసం ఒత్తిడి తేవడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. బాకాయిలు చెల్లిస్తామని చెపుతున్నారుగానీ చెల్లించడంలేదు. కిస్తీలు కట్టకుంటే షో రూం యజమానులు ట్రాక్టర్లను తీసుకెళ్తామంటున్నారు.
రాంగోపాల్, లీడ్
బ్యాంకు మేనేజర్, నిర్మల్