27-03-2025 01:22:49 AM
మహిళకు సీఐ హెచ్చరిక
మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన బాధిత కుటుంబం
జనగామ, మార్చి 26(విజయక్రాంతి): తమ భూమిని వదులుకోకుంటే రౌడీషీట్ తెరుస్తానని సీఐ బెదిరిస్తున్నాడని, న్యాయం కోసం వెళ్లిన తనపై ఇప్పటికే ఉల్టా పలు కేసులు బనాయించారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసు అధికారి సివిల్ తగాదాలో జోక్యం చేసుకుని తమపై బెదిరింపుకుల పాల్పడుతున్నారని సదరు మహిళ చెబుతోంది. ఆయన వేధింపులు తట్టుకోలేక మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం రెడ్డిపురం గ్రామ శివారులో 126 సర్వే నంబరులో ఎకరా స్థలంపై రెండు పార్టీల మధ్య వివాదం నడిచింది. సదరు జాగా దుగ్లంపుడి టేకులమ్మ భర్త మల్ రెడ్డికి చెందినది కాగా కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
జిల్లా న్యాయస్థానం అడ్వకేట్ కమిషన్ వేసి టేకులమ్మ, ఆమె కుమారుడు రంజిత్ కుమార్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2017లోనే ఈ భూ తగాదాకు కోర్టులు పరిష్కారం చూపించాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే అనచరుడైన రజినీకర్ రెడ్డి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని రత్న మేరీ ఆరోపిస్తున్నారు. 2024 ఆగస్ట్ 31న అర్ధరాత్రి స్థలానికి సంబంధించిన ప్రహరీని దుండగులు కూల్చేశారని వాపోయారు. 2025 మార్చి 18న ఆ స్థలంలోకి వచ్చి తనపై దర్భాషలాడారని రత్న మేరి ఆరోపించారు. ఈ మూడు సందర్భాలలో తాను పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి తమపైనే కేసులు బనాయించారని చెప్పారు. 2025 మార్చి 18న కొంతమంది గుంపుగా వస్తే సీఐ రవికుమార్‌కు ఫోన్ చేస్తే మళ్లీ తమపై ఎఫ్‌ఐఆర్ చేశారని తెలిపారు. ఆ స్థలాన్ని వదిలేయకపోతే మరిన్ని కేసులు పెడతామని, రౌడీషీట్ కూడా తెరుస్తామని సీఐ రవికుమార్ హెచ్చరిస్తున్నట్లు రత్న మేరీ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.