దక్షిణ మండలంలో యథేశ్చగా అక్రమ నిర్మాణాలు
అవినీతిలో కూరుకుపోయి అటువైపు చూడని అధికారులు
చార్మినార్, జూలై ౩ (విజయక్రాంతి) : దక్షిణ మండలం మున్సిపల్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగు తున్నాయి. పాతబస్తీలో కొందరు జీ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకొని ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా సెల్లార్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పైగా ఫిర్యాదుదారులకే క్లాస్ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తవ్విస్తోంది. అధికారుల తీరుపై బస్తీవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టాలని, అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.
టౌన్‌ప్లానింగ్ అధికారుల ఇష్టారాజ్యం
దక్షిణ మండలం పరిధిలోని గౌలిపుర డివిజన్‌కు చెందిన పలు బస్తీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎతైన కట్టడాలు నిర్మిస్తున్నారు. పటేల్‌నగర్ బస్తీలో తొమ్మి ది నెలల క్రితం ఓ వ్యక్తి 180 గజాల ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, దీనిపై స్థానిక బస్తీవాసులు సర్కిల్ సంతోష్‌నగర్ టౌన్‌ప్లానింగ్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అప్పట్లో సెక్షన్ ఇంచార్జీగా పనిచేస్తున్న సుకన్య నిర్మాణ పనులను పరిశీలించి పనులను నిలిపివేయాల్సిందిగా సదరు యజమానికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. పది రోజుల పాటు పనులను నిలిపివేసిన ఇంటి యాజమని తిరిగి మళ్లీ ప్రారంభించాడు.
అధికా రుల నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు స్థానికులకు చెప్పడంతో నిజమా? కాదా? అనే విషయం తెలుసుకునేందుకు వారు ఫిబ్రవరిలో ఆర్‌టీఏకు దరఖాస్తు పెట్టుకున్నారు. నిర్మాణానికి అనుమతి లేదని మున్సిపల్ ఆఫీసు నుంచి సమాధానం వచ్చింది. ఈ ఘటనతో లంచాలు తీసుకొని టౌన్‌ప్లానిం గ్ అధికారులు మౌనంగా ఉంటున్నారని మరోసారి రుజువైందని బస్తీవాసులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలు పాటించని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పాతబస్తీ ప్రజలు కోరుతున్నారు.