* అమిత్‌షాకు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సవాల్
* కేసులు ఉపసంహరించుకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
న్యూఢిల్లీ, జనవరి 12: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలోని మురికి వాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ప్రజల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లోనే వాళ్లకు ఇళ్లు కట్టిస్తామని కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
సవాల్‌ను స్వీకరించి, అమలు చేస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఢిల్లీలోని షాకూర్ బస్తీని ఆయన సందర్శించి మాట్లాడారు. బీజేపీ తొలుత ఓట్లు అడిగి ఎన్నికల తర్వాత భూములును లాక్కుంటుందని ఆరోపించారు.
నగరంలో 4లక్షల కుటుంబాలు మురికి వాడల్లో నివసిస్తున్నాయన్నారు. అయితే బీజేపీ మాత్రం గత ఐదేళ్లలో కేవలం 4700ఇళ్లను మాత్రమే మురికి వాడల్లోని ప్రజల కోసం నిర్మించిందన్నారు. ఈ లెక్కన ప్రజలందరికీ ఇళ్లు రావాలంటే వెయ్యి సంవత్సరాలు పడుతుందని విమర్శించారు.
ఆరోపణలు కొట్టిసారేసిన కేంద్ర మంత్రి
ఆప్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్‌పూరీ విమర్శించారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలను ఆప్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటుందని ఆరోపించారు.
అనధికార కాలనీలను రెగ్యూలేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే దీనికి ఆప్ ప్రభుత్వం సహకరించలేదని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.