calender_icon.png 19 November, 2024 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే.. కమిటీని పంపు

19-11-2024 02:23:18 AM

  1. రైతు రుణమాఫీ వివరాలు అందజేస్తాం
  2. రాష్ట్రంలో అమలుచేసిన హామీలు చూపిస్తాం 
  3. మోదీ, బీజేపీ నేతలకు రేవంత్‌రెడ్డి సవాల్
  4. మీ 11ఏళ్ల పాలనలో ఒక్క విజయగాథా లేదు
  5. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి  

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో రైతు రుణమాఫీ చేయలేదంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఓ కమిటీని రాష్ట్రానికి పంపించాలని ప్రధాని, బీజేపీ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి వచ్చేందుకు మీ దగ్గర డబ్బులు లేకపోతే తానే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానని సూచించారు.

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇచ్చి, చేసి చూపించామని వెల్లడించారు. 25 రోజుల్లో రూ.18 వేల కోట్లతో 23 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్పించామని స్పష్టంచేశారు. కేంద్ర కమిటీ రాష్ట్రానికి వస్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇస్తామని చెప్పారు. మహారాష్ర్ట ఎన్ని కల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి పుణె లో మీడియాతో మాట్లాడారు.

పదకొండేళ్ల పాలన తర్వాత కూడా మోదీ ప్రభుత్వానికి, మహారాష్ర్టలోని మహాయుతి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక విజయగాథ లేదని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు బాంబు పేలుళ్లు.. ఇతర కొత్త కొత్త అంశాలను బీజేపీ తెరపైకి తెస్తున్నదని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయ కపోగా, వారికి వ్యతిరేకంగా వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చారని మండిపడ్డారు. 16 నెలలపాటు రైతులు ధర్నాలు, ఆందోళనలు చేశారని.. ఆ సమయంలో 700 మందికిపై గా రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ర్టలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయంపై మోదీ మాట్లాడరా? అని ప్రశ్నించారు.

మహారాష్ర్టలో కోవర్ట్ అపరేషన్ పాలిటిక్స్ నడిపారని ధ్వజమెత్తారు. మహారాష్ర్ట సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చౌహాన్ వారి పార్టీలకు వెన్నుపోటు పొడిచి మోదీకి గులాములుగా మారి ముంభైని లూటీ చేస్తు న్నారని ధ్వజమెత్తారు. మహారాష్ర్ట శాసనసభ ఎన్నికల్లో ప్రచారం వేళ మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడం బీజేపీ ఓటమిని అంగీకరించిందని అన్నారు. 

చెప్పిన హామీలు అమలు చేశాం

రాహుల్‌గాంధీ, ఖర్గే నేతృత్వంలో రైతులకు ఇచ్చిన అతిపెద్ద గ్యారెంటీ రుణమాఫీని అమలు చేశామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.  రైతులు, పేదలు, నిరుద్యోగుల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమి చేయలేదని, ఇన్ని వైఫల్యా లు వారి వైపు ఉన్నప్పటికీ మోదీ కాంగ్రెస్ గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, సన్న ధాన్యంకు ఎంఎస్పీ మీద రూ.500 బోనస్‌ను రైతులకు ఇస్తున్నామని వెల్లడించారు. రాజకీయాల్లో నష్టం వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఆరు నూరైనా హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు.

50 వేల నియామక పత్రాలిచ్చాం 

తమ ప్రభుత్వం ఏర్పడిన ౧౦ నెలల్లోనే తెలంగాణలో 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఎల్బీస్టేడియంలో స్వయంగా తానే నియామక పత్రాలు అం దించానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణలో మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయణించే అవకాశం కల్పించామని.. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.

2004లో సోనియా గాంధీ సూచన మేరకు దీపం పథకం కింద రూ. 400 కే గ్యాస్ సిలిండర్, స్టవ్‌ను కేంద్ర ప్రభు త్వం అందజేసిందని, మోదీ ప్రధానిఅయ్యా క రూ.400 గ్యాస్ సిలిండర్‌ను రూ.1200కు పెంచారని ఆరోపించారు. సిలిండర్ ధర పెం పుతో పేద మహిళలు దాచుకున్న డబ్బును మోదీ చోరీ చేశారని విరుచుకుపడ్డారు.

తెలంగాణలో పేద మహిళలకు రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని, 50 లక్షల కుటుంబాలు రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని స్పష్టంచేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామని, పట్టణాలు, పల్లెల్లో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని వెల్లడించారు.

పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో దేశంలోనే మొదటిసారిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, ఇప్పుడు దానిని తెలంగాణలో రూ.10 లక్షలకు పెంచామని స్పష్టంచేశారు. పేదల వైద్యానికి ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు.

తమ గ్యారంటీలు కచ్చితమైన గ్యారంటీలని, మోదీవి కావని అన్నారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందున మోదీ, బీజేపీ నాయకులు మంగళవారం హైదరాబాద్ వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి తాను చెప్పిన ప్రతి అంశం వివరాలు అందజేస్తానని చెప్పారు.

అందులో ఏమైనా తప్పు ఉంటే క్షమాపణలు చెప్తానని స్పష్టంచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో 95 శాతానికిపైగా ప్రజలు హిందువులు.. వారు బీజేపీకి ఓటు వేయలేదని కాంగ్రెస్‌కు వేశారని గుర్తుచేశారు. మహారాష్ర్టలోనూ కాంగ్రెస్‌ను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. 

ముస్లిం కోటాపై చర్చిస్తాం 

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం వచ్చాక ముస్లింలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ముస్లింల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఉదాహరణగా చెప్తూ పేదలకు, నిరుపేదలకు న్యాయం జరిగేలా చూస్తామ న్నారు. ఇప్పటికే తెలంగాణలో 4 శాతం కోటా అమలు చేస్తున్నామని తెలిపారు. మొదట 5శాతం ఇచ్చామని.. కానీ 50 శాతం పరిమితి దాటిందని సుప్రీంకోర్టు చెప్పడంతో ౪శాతానికి తగ్గించామన్నారు.  

గుజరాత్ గులాములు 

మహారాష్ర్టపై ఎప్పుడు చర్చ వచ్చినా ఛత్రపతి శివాజీ పేరు వస్తుందని, అంబేడ్కర్ పేరు లేకుండా రాజ్యాంగం.. రాజకీయాలు లేవని రేవంత్‌రెడ్డి అన్నారు. క్రికెట్‌లో సచిన్, పాటల విషయంలో లతా మంగేష్కర్ పేరు లేకుండా వాటి ప్రసక్తే లేదని చెప్పారు. కానీ, ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్‌పై చర్చ సాగుతోందని అన్నారు.

షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ ఏమైనా పాకిస్థాన్‌పై పోరాడారా? బంగ్లాదేశ్‌ను భారత్‌లో కలిపారా? మహారాష్ర్ట ప్రజల తీర్పును కాలరాసి గుజరాత్‌కు గులాంలుగా మారారని విమర్శించారు. మహారాష్ర్ట నేల వీరుల నేల అని చెప్పారు.

ఇప్పుడు కొందరు విద్రోహులు తయారయ్యారని, వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కడెగాం నియోజకవర్గంలో తమ అభ్యర్థి విశ్వజిత్ కదమ్‌కు 1.50 లక్షల మెజార్టీ వస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యర్థి దేశ్‌ముఖ్‌కు డిపాజిట్ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.