calender_icon.png 24 November, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే పాతబస్తీలో కూల్చివేయాలె

27-08-2024 02:42:16 AM

హైడ్రాకు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్  

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు దమ్ముంటే పాతబస్తీలో అక్రమ కట్టడాలను ముందుగా కూల్చివేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు హైడ్రాతో హంగామా చేస్తోందని విమర్శించారు. హైడ్రా అధికారులకు సల్కం చెరువులో ఉన్న ఓవైసీ భూములను కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు.

కమిషనర్‌కు కనిపించకుంటే తానే వచ్చి చూపిస్తానని తెలిపారు. అధికారుల వద్ద తగినన్ని జేసీబీలు లేకుంటే పక్క రాష్ర్టం నుంచి తెప్పించి ఇస్తానని ఏలేటి పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువుల్లో అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా లేదంటే తానే పంపిస్తానని తెలిపారు. ఓల్డ్ సిటీలో ఇష్టానుసారంగా చెరువు, గుట్టలను కబ్జా చేశారని, గత ప్రభుత్వం కండ్లు మూసుకుందని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వానికి, హైడ్రాకు దమ్ము,  ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొంతమంది టార్గెట్‌గా హైడ్రా పనితీరు కనిపిస్తోందని ఆరోపించారు. గత బీఆర్‌ఏస్ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీ విషయంలో హైడ్రామా చేసిందని, అదే తీరుగా ఇప్పుడు ఈ సర్కారు వ్యవహరిస్తోందన్నారు. రాష్ర్టంలో ఉన్న చెరువులు ఎన్ని, ఆక్రమణకు గురైన చెరువులు ఎన్ని, అన్యాక్రాంతం అయిన భూముల లెక్కపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.