- ఓటమితోనే రాజకీయ జీవితం ప్రారంభం
- ఏడాదిగా కేసులతో ఉక్కిరిబిక్కిరి
- బెదరకుండా ధైర్యంగా ఎన్నికల బరిలోకి
- నాలుగోసారి సీఎంగా సోరెన్
రాంచీ, నవంబర్ 23: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయఢంకా మోగించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అవుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అవినీతి కేసులో జైలు పాలైన సోరెన్ బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత రెట్టింపు వేగంతో పార్టీ విజయానికి కృషి చేశారు.
అయితే సవాళ్ల నడుమ ఎదురీదడం సోరెన్‌కు ఇది కొత్తేం కాదు. ఆయన రాజకీయ జీవితమే ఓటమితో ప్రారంభమైంది. 2005లో జేఎంఎం పార్టీ తరఫున దుమ్కా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి స్టీఫెన్ మరాండి చేతిలో ఓటమి చెందడంతోపాటు కేవలం 19,610 ఓట్లను మాత్రమే పొంది మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తర్వాత ఎంపీగా రాజ్యసభకు వెళ్లిన సోరెన్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్కా నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలోకి దిగి 30.97శాతం ఓట్లతో ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2010 జనవరి 2013 మధ్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో 2013లో మొట్టమొదటిసారిగా జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదిన్నరపాటు ఆ పదవిలో కొనసాగారు.
బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవం
సీఎం హోదాలో 2014 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సోరెన్‌కి ఘోర ఓటమిని ఎదురైంది. దుమ్కా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లూయిస్ మరాండి చేతిలో దాదాపు 5వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో సోరెన్ బర్హుతై నియోజకర్గం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2015 మధ్య కాలంలో ఆయన జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు.
బిర్సా ముండాకు భక్తుడు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్, రూపి సోరెన్ దంపతులకు రెండో సంతానంగా హేమంత్ సోరెన్ 1975 ఆగస్ట్ 10న జన్మించారు. పాట్నా హై స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసి రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తన చదువును మధ్యలోనే ఆపేశారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన సోరెన్ గిరిజనుల హక్కుల కోసం పోరాటాలు చేసి పిన్నవయసులోనే ప్రాణాలు వదిలిన బిర్సా ముండాకు అమితమైన భక్తుడు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా సోరెన్
ప్రతిపక్ష నేతగా 2015-19 మధ్య బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన 2022లో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.
అనంతరం భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయనను అరెస్టు చేయడానికి ముందు 2024 ఫిబ్రవరిలో సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. జూన్ 28న బెయిల్‌పై విడుదలైన సోరెన్ జూలైలో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా ఎన్నికల్లో బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను బలంగా తిప్పికొట్టిన సోరెన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి జార్ఖండ్ 6వ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం అవుతున్నారు.