calender_icon.png 16 November, 2024 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్ కోసం వస్తే అసలుకే ఎసరు

16-11-2024 12:57:27 AM

  1. సన్న వడ్ల రైతులకు తిప్పలు
  2. తేమ పేరుతో నిర్వాహకుల కొర్రీలు 

కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తీరా పంటను కోసం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే నిర్వాహకులు తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. దీంతో 15 రోజులైనా కాంటా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

లోడ్‌కు సరిపడా సన్నవడ్లు రాలేదని వచ్చే వరకు ఉండాలని నిర్వాహకులు షరతులు పెడుతున్నారు. దీంతో బోనస్ కోసం ధాన్యాన్ని తెస్తే అసలుకే ఎసరు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బోనస్ మాట దెవుడెరుగు బయట మార్కెట్‌లో అమ్ముకుంటే ధర ఎక్కువ వస్తుందని రైతులు అంటున్నారు. దీంతో కొందరు రైతులు కొనుగోలు సెంటర్లకు సన్నవడ్లను తీసుకొచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. 

రవాణా ఖర్చులతో ఇబ్బందులు

కామారెడ్డి జిల్లాలో సన్నరకం వడ్లను కొనేందుకు 47 సెంటర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సన్నధాన్యాన్ని కొంటే రైతులకు ఇబ్బందులు తప్పేవి. వేరే గ్రామానికి తీసుకెళ్లి సన్నధాన్యాన్ని అమ్మాలంటే రవాణా ఖర్చులతో పాటు అక్కడ రోజుల తరబడి ఉండేందుకు ఖర్చుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెళ్లగానే కాంటా పెట్టడం లేదు. తేమ పేరుతో, లారీ లోడ్ నిండేందుకు సరిపడా ధాన్యం లేదంటూ నిర్వాహకులు కొనకపోవడంతో రోజుల తరబడి కేంద్రం వద్దే ఉండాల్సి వస్తుంది. దీంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. 

సన్న వడ్లు ఎక్కువగా వస్తలేవు..

కామారెడ్డి జిల్లాలో సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా రావడం లేదు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశాం. రైతులకు ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలి. తేమశాతం ఎక్కువగా ఉంటేనే ఆలస్యం జరుగుతుంది తప్పా కొనుగోళ్లలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. 

 రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, కామారెడ్డి