calender_icon.png 7 October, 2024 | 9:52 AM

ఆ లింకులు క్లిక్ చేస్తే ఖతమే!

06-10-2024 12:00:00 AM

పండుగ పూట ఆన్‌లైన్ షాపింగ్ పేరిట నకిలీ ఈ కామర్స్ వెబ్‌సైట్లు

తెలియని లింక్‌లపై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రోజుకో కొత్త రకం మోసాలతో ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల ఆశను అవకాశంగా మలుచుకున్న నేరగాళ్లు.. భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ పంజా విసురుతున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌ల స్థానంలో నకిలీ యాప్‌లు క్రియేట్ చేసి భారీ డిస్కౌంట్లు అంటూ సైబర్ లింక్‌లను పంపి మోసానికి తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలపై అప్రమత్తత చాలా అవసరమని, తెలియని లింకులపై క్లిక్ చేసి ఖాతాలు ఖాళీ చేసుకోవొద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి హెచ్చరిస్తున్నారు. 

ఆన్‌లైన్ షాపింగ్ కేంద్రంగా..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ వైపే మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ కామర్స్ వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఆసరాగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు షాపింగ్ యాప్‌లతో పాటు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లకు కూడా నకిలీ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి భారీ డిస్కౌంట్ల పేరుతో పలు లింక్‌లను పంపిస్తున్నారు.

అత్యాశతో ప్రజలు భారీ డిస్కౌంట్ వస్తుందని లింక్ క్లిక్ చేస్తే వారికి తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బు లూటీ చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో లింక్ క్లిక్ చేయగానే అందులో ఫ్రీ గిఫ్ట్, లక్కీ డ్రా, గిఫ్ట్ ఓచర్ వంటివి ప్రత్యక్షమవుతాయి.

వాటిని క్లిక్ చేసిన వెంటనే సంబంధిత సైబర్ నేరగాడు గిఫ్ట్ ఆఫర్ చేసిన సంస్థ ప్రతినిధిగా మాటలు కలుపుతాడు. ఈ క్రమంలో బాధితుడిని మాటల్లోకి దింపి, భారీ డిస్కౌంట్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టించి నిండా ముంచుతారు. 

స్పిన్ టూ విన్ గేమ్‌తో.. 

ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌ను పోలిన నకిలీ అమెజాన్ పేరుతో స్పిన్ టూ విన్ అనే గేమ్ లింక్‌ను మొబైల్‌కు పంపిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. అందులో గేమ్ ఆడి వచ్చిన బహుమతులను ఉచితంగా పొందాలంటూ స్పిన్‌పై క్లిక్ చేసేలా చేస్తారు. ఆ గేమ్‌లో సుమారు 10 నుంచి 15 రకాల గిఫ్ట్ ఐటమ్స్, రూ. లక్షల్లో నగదు, భారీ డిస్కౌంట్ వంటి వాటితో పాటు దీన్ని ఐదుగురికి ఫార్వర్డ్ చేయడం వంటి వాటిని ఏర్పాటు చేస్తారు.

ఇలా  కొద్ది మందిని రూ. లక్షల్లో గెలిచావంటూ నమ్మించి ప్రాసెసింగ్ ఛార్జీల పేరిట అందినంతా దోచుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో గ్రూపులోని ఐదుగురికి పంపితే గిఫ్ట్ వస్తుందని నమ్మించి, వారు అలా ఐదుగురికి గేమ్ లింక్ పంపిన తర్వాత అవతలి వారి నంబర్లను సైబర్ నేరగాళ్లు పొందుతుంటారు. అనంతరం వారిని కూడా పలు రకాలుగా మోసానికి గురిచేస్తుంటారు. 

అప్రమత్తత అవసరం

ప్రజల అత్యాశ సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారుతోంది. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు, షాపింగ్ చేయకుండానే ఫ్రీ గిఫ్ట్ కూపన్, లక్కీ డ్రా అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లు వస్తే నమ్మకండి. షాపింగ్ చేయకుండానే గిఫ్ట్ కూపన్‌లు ఎవరూ ఇవ్వరు. ఇలాంటి వాటిని క్షుణ్ణంగా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలియని లింక్‌లపై క్లిక్ చేయొద్దు.  

 శివమారుతి, సైబర్ క్రైమ్ ఏసీపీ