calender_icon.png 20 November, 2024 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకుంటే కటకటాలే!

20-11-2024 01:48:25 AM

కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్య!

  1. కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీకి రా 
  2. అచ్చొచ్చిన ఆంబోతుల్లా కేటీఆర్, హరీశ్ తీరు
  3. హైదరాబాద్‌కు పోటీగా వరంగల్ అభివృద్ధి 
  4. మామునూరుతోపాటు మరో ౩ చోట్ల ఎయిర్‌పోర్టులు
  5. హనుమకొండ మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు, ఫుల్లుకు, హాఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. అందుకే ఊరికో బెల్టు షాపు పెట్టి మనుషులను మత్తులో ముంచి గెలవాలనుకుంటే, తెలివిగల్ల తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. కేసీఆర్.. నువ్వు ఫాంహౌజ్‌లోనే తాగి పండు.. కావాలంటే మందు ఇయ్యమని వైన్‌షాపుకు చెప్తా, బిల్లు నేనే కడుతా. 

* కాళోజీ ఇప్పుడు బతికుంటే కిషన్‌రెడ్డిని, కేసీఆర్‌ను తరిమికొట్టేవాడు. ప్రధాని మోదీకి, గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నది కిషన్‌రెడ్డి కాదా?   

సీఎం రేవంత్‌రెడ్డి

  1. ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  2. ఎవరు అడ్డంపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు

జనగామ, నవంబర్ 19 (విజయక్రాంతి): కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే వారికి కటకటాలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ‘పదేళ్లు దోపిడీకి గురైన తెలంగాణను పది నెలల్లో విముక్తి చేసి ప్రజలకు స్వేచ్ఛ అందించినం.. దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ చేయని అభివృద్ధిని పది నెలల్లో మేం చేసి చూపిస్తున్నాం..

పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిందని కొందరు అంటున్నారు.. ప్రజలు ఏం కోల్పోలే.. కేసీఆర్ కుటుంబమే ఉద్యోగాలు కోల్పోయింది.. మరోసారి కేసీఆర్ అనే మొక్కను ఈ తెలంగాణ గడ్డ మీద మొలవనియ్యను..’ అని సీఎం అన్నారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చకు తాము సిద్ధమని.. ఎవరస్తారో రండి అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు తాము వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. కాళోజీ ఇప్పుడు బతికుంటే కిషన్‌రెడ్డి, కేసీఆర్‌లను తరమికొట్టేవారని అన్నారు. మంగళవారం ఆయన వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సభకు హాజరయ్యారు. ఇక్కడ 22 మహిళా శక్తి భవనాలను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సభనుద్దేశించి ప్రసంగిం చారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.

గత ప్రభుత్వం క్యాబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యమవ్వలేదని, తమ క్యాబినెట్ లో మాత్రం ఉమ్మడి వరంగల్ నుంచే కొండా సురేఖ, సీతక్కకు అవకాశం ఇచ్చామన్నారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్య తెలంగాణ తరఫున పార్లమెంటులో గళం విప్పుతున్నారన్నారు. పాలకుర్తిలో ఓ రాజకీయ రాక్షసుడిని యశస్వినిరెడ్డి మట్టికరిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేశారని, ఈ ప్రాంతంలో మహిళా శక్తి అమోఘమని కొనియాడారు.

ఆడబిడ్డలను కార్పొరేట్లుగా మారుస్తాం

తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తయారుచేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంబానీ, ఆదానీ, టాటా, బిర్లాల వలే మహిళలను బడా వ్యాపారవేత్తలుగా, కార్పొరే ట్లుగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. అందుకే మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పగిస్తున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు వడ్డీ లేని రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. 

చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి

వరంగల్ ప్రాంతాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాంతంతో కాంగ్రెస్‌కు ఎంతో సెంటిమెంట్ ఉందన్నారు. వరంగల్ గడ్డ మీద రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అప్పటి నుంచే కాంగ్రెస్ మరింత బలపడిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వరంగల్ అభివృద్ధికి రూ.4,962 కోట్లు మంజూరు చేశామన్నారు.

గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఎన్నో వాగ్దానాలు చేసి తుంగలో తొక్కారన్నారు. వరంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌లు కూడా రావన్నారు. వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పట్టుబట్టి నిధులు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనను తిండి తిననియ్యకుండా, నిద్ర పోనివ్వకుండా వెంబడిపడ్డారని అన్నారు.

పొంగులేటి ప్రత్యేక చొరవ తీసుకుని వందలాది సమీక్షలు చేసి అధికారులను పరుగులు పెట్టించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు భూ సేకరణ, టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూళ్లు, సదుపాయాలు, కాళోజీ కళాక్షేత్రం తదితర పనులకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నిధులు సమకూర్చామన్నారు.

ఉత్తర తెలంగాణపై ఫోకస్

వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే పరిశ్రమలు వస్తాయని, అందుకే యుద్ధప్రాతిపదికన ఆ పనులు చేస్తున్నామన్నారు. పక్క రాష్ట్రాల్లో చాలా విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే ఉందన్నారు.

విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఒక్క వరంగల్‌లోనే కాకుండా కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లోనూ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని సీఎం ప్రకటించారు.

ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేశానని, రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ఖాతాల్లో దోషాలు, టెక్నికల్ సమస్యల వల్ల కొందరికి మాఫీ కాలేదని, అందరికీ త్వరలోనే రుణమాఫీ చేసి తీరుతామని సీఎం మాటిచ్చారు.

తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ 

పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిందని కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు పది నెలల్లో ఏం కోల్పోలేదని, కేసీఆర్ కుటుంబమే ఉద్యోగాలు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. పది నెలల్లో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, నిరుద్యోగ యువతకు 50 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు, ఫుల్లుకు, హాఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. అందుకే ఊరికో బెల్టు షాపు పెట్టి మనుషులను మత్తులో ముంచి గెలవాలనుకుంటే, తెలివిగల్ల తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ‘కేసీఆర్.. నువ్వు ఫాంహౌజ్‌లోనే తాగి పండు.. కావాలంటే మందు ఇయ్యమని వైన్‌షాపుకు చెప్తా, బిల్లు నేనే కడుతా’ అంటూ ధ్వజమెత్తారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదా ఇస్తే ఫాంహౌస్‌లో పంటావా.. అక్కడ గాడిద పల్లు తోముతున్నావా అని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ఏమైనా సహేతుకమైన అంశాలను లేవనెత్తితే మేం సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లని అసెంబ్లీకి పంపుతున్నారని అన్నారు. బిల్లా రంగలు అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి చేస్తున్న వారి కాళ్లల్ల కట్టె అడ్డం పెట్టాలని చూస్తున్నారని కేసీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు.  

గుజరాత్‌కు గులాం కిషన్‌రెడ్డి

సోనియాకు తాను గులాంగిరి చేస్తున్నానని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఒక రాష్ట్రంలో పార్టీ చచ్చిపోతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అని కొనియాడారు. ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా తప్పు లేదన్నారు. అలా నీళ్లు పోసుకుని కిషన్‌రెడ్డికి పాప ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.

ప్రధాని మోదీకి, గుజరాత్ రాష్ట్రానికి గులాంగిరి చేస్తున్నది కిషన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కళ్లు మండుతున్నాయని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించిందంటూ తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి సోనియాగాంధీపై మోదీ విమర్శలు చేస్తే ఆయన గులాంగిరి చేయడం సిగ్గుచేటన్నారు.

కిషన్‌రెడ్డికి తెలంగాణలో ఉండే హక్కు లేదని, తట్టాబుట్టా సర్దుకుని గుజరాత్‌కు వెళ్లిపోవాలని సూచించారు. కిషన్‌రెడ్డికి తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రజలు ఉద్యోగం ఇచ్చారని, మోదీ ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. కిషన్‌రెడ్డి అంటే తనకు పూర్తిగా పోయిందని సీఎం అన్నారు.

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం..

వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుగా హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. హయగ్రీవచారి గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో దిగిన రేవంత్‌రెడ్డి పక్కనే ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి నడుచుకుంటూ వచ్చారు. ముందుగా కళాక్షేత్రం ఎదుట ఉన్న కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం కళాక్షేత్రాన్ని ప్రారంభించి లోపల ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. అనంతరం ఆడిటోరియంను పరిశీలించి అక్కడే ఆసీనులై ఐదు నిమిషాల నిడివి గల కాళోజీ బయోగ్రఫీ వీడియోను తిలకించారు. అంతకుముందు కళాక్షేత్రం ఆవరణలో వరంగల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం విజయోత్సవ సభలో కళాక్షేత్రంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లయినా కాళోజీ కళాక్షేత్రాన్ని కేసీఆర్ సర్కార్ పూర్తిచేయలేకపోయిందన్నారు. వారి చేతగానితనం వల్ల పనులు పూర్తికాకపోతే మేం ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పూర్తిచేశామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ 50 సార్లు సచివాలయానికి వచ్చి భట్టితో చర్చిస్తే రూ.45 కోట్లు వెంటనే ఇచ్చి పనులు పూర్తి చేసి కళాక్షేత్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

తెలంగాణ పౌరుషానికి మారుపేరు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ భాషోద్యమంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. కాలోజీ కవిత్వం చదవని వాడు కవే కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

చిప్ప చేతికిచ్చిన కేసీఆర్: మంత్రి జూపల్లి కృష్ణారావు

ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన ఘతన మాజీ సీఎం కేసీఆర్‌దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు దుయ్యబట్టారు. రూ.8 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చిప్ప చేతికిచ్చి వెళ్లిపోయారని విమర్శించారు. అయినా రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేయక రైతులకు రుణమాఫీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు.

ఉక్కు మనిషి ఇందిరమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ అభ్యుదయ కవి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాగిపోవుటే, ఆగిపోవుటే చావు అంటూ భారత స్వాతంత్రోద్యంలో నిప్పు రగిల్చిన కవి కాళోజీ అని గుర్తు చేశారు.

మూసీ ప్రక్షాళన బృహత్తర కార్యక్రమం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కింద ఫ్లోరైడ్, పైన మూసీ కం పుతో నల్లగొండ ప్రజలు రోగాల తో కొట్టుమిట్టాడుతుంటే గత ముఖ్యమంత్రులెవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకోవడం గొప్ప విషయమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న సీఎంకు మంత్రులమంతా అండగా ఉంటామన్నారు. మూసీని ప్రక్షాళన చేద్దామంటే బావబామ్మర్దులు, ఇద్ద రు కేంద్రమంత్రులు కాళ్లడ్డం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పనిచేయకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్రాజెక్టు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే, ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని మండిపడ్డారు. వరంగల్ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకే ఇప్పటివరకు రూ.6 వేల కోట్లు మంజూరు చేశామని స్పష్టంచేశారు.

వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆడబిడ్డలను కార్పొరేట్లుగా తయారుచేయడం కోసం మహిళా సమాఖ్య సంఘాలకు 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును అందిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

మడప తిప్పని వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి: మంత్రి కొండా సురేఖ

సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇస్తే తప్పబోడని, మడమ తిప్పే రకం కాదని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. తాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిని ఎంతో అభిమానించేదని, తరువాత తన అభిమాన నేత సీఎం రేవంత్‌రెడ్డేనని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌తోనూ కలిసి పనిచేశానని, ఆయన వాగ్దానాలు చేయడం తప్ప అమలు చేయరని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం తాను సీఎం వెంట పడ్డానని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం భారీ నిధులు మంజూరు చేశారన్నారు. వరంగల్‌కు రూ.5 వేల కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కబ్జా అయిన ఒక్క గజం కూడా వదలం: మంత్రి పొంగులేటి

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నాయకులు అంతులేని కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కబ్జాకు గురైన భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. కబ్జాకు గురైన ఒక్క గజం స్థలాన్ని కూడా వదలబోమని స్పష్టంచేశారు.

హైదరాబాద్ తరువాత అదే స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ మామునూరు ఎయిర్‌పోర్టును త్వరలోనే పూర్తిచేస్తామని మాటిచ్చారు. వరంగల్‌లో ఇన్నర్ రింగు రోడ్డును మూడు విడతల్లో పూర్తిచేయనున్నట్లు పొంగులేటి తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలు పక్కా: మంత్రి శ్రీధర్‌బాబు

ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల పథకాలను తప్పకుండా అమలుచేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిందన్నారు. మేం చేసినా ప్రతి వాగ్ధానాన్ని ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామన్నారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. మరోవైపు పథకాలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు.

మహిళలతోనే సమాజం అభివృద్ధి: మంత్రి సీతక్క

మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. రూ.500కే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న ఘనత తమదేనన్నారు. మహాలక్ష్మి కింద ఉచిత బస్సు సర్వీసులు పెడితే బీఆర్‌ఎస్ వాళ్లు ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

ఒకట్రెండు చోట్ల మహిళలు గొడవ పడ్డ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసి ఫ్రీ బస్సు పథకాన్ని అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. మహిళలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాలు రూ.21 వేల కోట్లు ఇవ్వడం హర్షనీయమన్నారు. మహిళా గ్రూపులకు 150 బస్సుల నిర్వహణ అప్పగించనున్నట్లు తెలిపారు.

కుల సర్వే దేశానికే దిక్సూచి: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో నిర్వహిస్తున్న ఇంటింటి కుల గణన సర్వే దేశానికే దిక్సూచి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మా ప్రభుత్వం అన్నట్లుగా ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక మన ప్రభుత్వంగా మారిందని చెప్పారు. దొరల పాలన పోయి ప్రజాస్వామ్య పాలన వచ్చిందని చెప్పారు.

ఇందిరమ్మ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు రూ.3,720 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 600 సమైఖ్య సంఘాల ద్వారా రూ.240 కోట్లతో బస్సులను కొనుగోలు చేసి నడిపించేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

హైకమాండ్ చెప్పుచేతల్లో రేవంత్ 

* తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్ల పేరుతో పెద్దలకు మూట లు మోస్తున్నారు. 

* ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నారు.

* రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటా రేవంత్ ?

* తెచ్చే అప్పుల్లోనూ కమీషన్లు దండుకునే విధంగా ఏర్పాట్లు.

* అభివృద్ధి పనుల్లో కమీషన్లకు సీఎం కుటుంబ సభ్యులతోనే టెండర్లు.

* హైకమాండ్ చెప్పు చేతల్లో రేవంత్ ఏడాది పాటు పాలన సాగించారు.

* ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు?

* హామీలు అమలు చేయని సీఎం మూసీ ప్రక్షాళనకు రూ.౧.౫౦ లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? మూసీ సుందరీకరణ ఎలా పూర్తి చేస్తారు?

గుజరాత్‌కు గులాం కిషన్‌రెడ్డి

* నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఒక రాష్ట్రంలో పార్టీ చచ్చిపోతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా.

* ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా తప్పులేదు. అలా నీళ్లు పోసుకుని కిషన్‌రెడ్డికి పాప ప్రక్షాళన చేసుకోవాలి. 

* ప్రధాని మోదీకి, గుజరాత్ రాష్ట్రానికి గులాంగిరి చేస్తున్నది కిషన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. 

* మూసీ ప్రక్షాళన చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కళ్లు మండుతున్నాయి.

*  తల్లిని చంపి బిడ్డను బతికించిందంటూ తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి సోనియాగాంధీపై మోడీ విమర్శ లు చేస్తే ఆయనకు గులాంగిరి చేయడం సిగ్గుచేటు. 

* కిషన్‌రెడ్డికి తెలంగాణలో ఉండే హక్కు లేదు. తట్టాబుట్టా సర్దుకుని గుజరాత్‌కు వెళ్లిపోవాలి. 

* కిషన్‌రెడ్డికి తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రజలు ఉద్యోగం ఇచ్చారని, మోదీ ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు.