కురుమూర్తి దయతోనే సీఎం అయ్యా
- వలసలు ఆపాలని చూస్తుంటే అడ్డుపడుతున్నారు
- బీఆర్‌ఎస్ నాయకులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్
- కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేసి సాగునీరిస్తామని హామీ
- రూ.110 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
హైదరాబాద్/మహబూబ్‌నగర్, నవంబర్‌౧౦ (విజయక్రాంతి): గత పదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పను లు చేయకపోవడం వల్లే ఇంకా వలసలు కొనసాగుతున్నాయని.. తాము వలసలను ఆపాలని చూస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుపడాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
పాలమూరు ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నవారు చరిత్ర హీనులుగా మిగిలిపో తారని హితవుపలికారు. దేశంలోని తాగు, సాగునీటి ప్రాజెక్టు పనుల్లో పాలమూరు బిడ్డల చెమట దాగి ఉన్నదని.. ఎక్కడెక్కడో బతుకుదెరువుకోసం వలస వెళ్లిన జిల్లాగా పేరొందిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక రెండుసార్లు ఈ ప్రాంత బిడ్డల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. ఇక్కడ అభివృద్ధి చేయకపోవడంతోనే నేటికీ వలసలు కొనసాగుతున్నా యని ఆరోపించారు.
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తి స్వామిని ముఖ్యమంత్రి ఆదివారం దర్శించుకుని, కొండకు వెళ్లే ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భం గా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత తనకే జిల్లా నుంచి సీఎంగా అవకాశం దక్కింద ని తెలిపారు. జిల్లాను ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తున్నా మహబూబ్ నగర్‌లో కరువు తాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
పాలమూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌కు ఓట్లు వేసి పార్లమెంట్‌కు పంపి ంచారని, రెండుసార్లు సీఎం అయ్యేందు కు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కానీ, ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, తనకు సీఎం పదవిని ఈ ప్రాంతం అందించిందని.. పాల మూరు రుణం తీర్చుకుంటానని స్పష్టంచేశారు. యవతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామగ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని భరోసానిచ్చారు.
క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తా
పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం ప్రసిద్ధి పొందిందని, రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచీ భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని, అందుకే భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు.
ఆలయానికి ఏం కావాలనేది జిల్లా కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలకు కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి వెళ్లలేని వారిని కురుమూర్తి వెంకన్న స్వామి కరుణిస్తాడని భక్తులు నమ్ముతారని తెలిపారు. పేదల తిరుపతిని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కురుమూర్తి, మన్యంకొండ జాతరలను ఇంకా ఘనంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేసి సాగు నీరిస్తాం
కృష్ణమ్మ జలాలతో పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకోరకంగా విమర్శలు చేయండి.. కానీ, అభివృద్ధికి అడ్డుపడవద్దని ప్రతిపక్షాలను ఆయన కోరారు. పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవరినీ క్షమించవద్దని యువతకు సూచించారు. వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా అని, అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు.
తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయని, జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేలా చేసేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని తెలిపారు. కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామని ఉద్ఘాటించారు.
తమ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే తనను చరిత్ర క్షమించదని అన్నారు. తనపైై కోపం ఉంటే రాజకీయంగా తనపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు. తాను ఎక్కడ ఉన్నా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించేవాడినే అని స్పష్టంచేశారు.
జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు.
కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ మధుసూదన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.