calender_icon.png 10 January, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూర్ఖులతో వాదిస్తే..

31-07-2024 12:05:00 AM

స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ టిప్ వివాదం అలా సద్దుమణిగిందో లేదో, తాజాగా అలాంటి వివాదంలోనే చిక్కుకుంది సీనియర్ నయనతార. ఇదే ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన నయన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మందార పువ్వుతో చేసిన టీని తాను అమితంగా ఇష్టపడతానని పేర్కొంటూ, దాంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటూ రాసుకొచ్చింది. నయన పోస్టుపై స్పందిస్తూ ఓ వైద్యుడు ‘ది లివర్ డాక్టర్’ అనే ఎక్స్ ఖాతా లో పోస్ట్ పెట్టాడు. ఫాలోవర్స్‌ను నయనతార తప్పుదోవ పట్టిస్తోందని, ఆమె మాటల్లో నిజం లేదని మండిపడ్డాడు. ఇలా హెల్త్ టిప్ విమర్శలకు దారి తీయటంతో నయన్ తన పోస్ట్‌ను తొలగించేసింది. తర్వాత మరో ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది.

‘తెలివి తక్కువ వారైన మూర్ఖులతో వాదించకండి.. మిమ్మల్ని వారి స్థాయికి లాగి, ఆపై అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు’ అంటూ ప్రముఖ అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ చెప్పిన పాపులర్ కొటేషన్‌ను ఆమె షేర్ చేసింది. నయనతారను, సమంతను విమర్శించిన డాక్టర్ ఒక్కడే కావటం గమనార్హం. సెలబ్రిటీలందరూ ప్రజారోగ్యంపై ఉచిత సలహాలు ఇవ్వడాన్ని అరికట్టేలా చట్టాలను తీసుకురావాలని లివర్ ఆ డాక్టర్ పిలుపునిచ్చారు. మరి, మూర్ఖులతో వాదించొద్దంటూ సెలబ్రిటీలు చేసే సూచనలను స్వీకరించటమా? డాక్టర్ పిలుపునందుకోవటమా? అనేది వారిని ఫాలో అవుతున్నవాళ్లే తేల్చుకోవాలి.