15-03-2025 12:32:14 AM
మున్సిపల్ ఖజానా నింపేందుకు సామాన్యులే టార్గెట్.
కమర్షియల్ టాక్స్ వసూళ్లలో మున్సిపల్ శాఖ తీరు.
10 కోట్లకు పైగా పేరుకుపోయిన మొండి బకాయిలు.
నాగర్ కర్నూల్ మార్చి 14 విజయక్రాంతి: వడ్డించేటోడు మనోడైతే చాలు ఏడ కూర్చున్నా కడుపు నిండుతుందన్న సామెతను నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్సి పాలిటీలు నిజం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా విలాసవంతమైన భవనాలు, భారీ కమర్షియల్ షెడ్లు, ఇతర వ్యాపార కేంద్రాలున్నప్పటికీ అవినీతి అక్రమార్కులిచ్చే నెలవారి ముడుపులకు కక్కుర్తి పడి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు వసూలు చేయకుండా మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి ఏటా వార్షిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మున్సిపల్ ఖజానా నింపుకోవడం కోసం తమ ప్రతాపాన్ని సామాన్యు లపై చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ టాక్సీ వసూళ్ల పేరుతో మొండి బకాయి దారులంటూ ముద్ర వేసి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.
కమర్షియల్ షెడ్లు, వ్యాపార సముదాయాలు, సినిమా హాలు షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల నుండి పన్నులు వసూలు చేయకుండా నెలవారి మామూళ్లను కమర్షియల్ టాక్స్ రూపంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు మున్సిపాలిటీలలో పరిధి లలో సుమారు 10 కోట్లకు పైగా పెండింగ్ బకాయి ఉన్నప్పటికీ వాటిని కూడా వసూళ్లు చేయలేకపోతున్నారు.
విలాసంతమైన భవనాలు నిర్మించే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది నుండి పై స్థాయి వరకు భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో ఏళ్ల తరబడి మున్సిపల్ శాఖకు పన్నులు కట్టకపోయినా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ శాఖ చైర్మన్ హోదాలో ఉన్న నేతలు కూడా మున్సిపల్ శాఖకు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని బురిడీ కొట్టిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
కానీ ఖజానాను నింపేందుకు మాత్రం టాక్సీల రూపంలో సామాన్యులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా అంటి ముట్టనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
పన్ను వసూళ్లలో నిరుపేదలే టార్గెట్..!
ఆయా మున్సిపాలిటీలోని తాగు నీరు, ఇంటి పన్నుల, సినిమా హాల్లో ఫంక్షన్ హాల్ లో ఇతర వ్యాపార రంగాలు చెల్లించే పన్నుల ఆధారంగానే మున్సిపాలిటీ ఆదాయం సమకూరి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. కానీ ప్రభుత్వ భూములు ఇతర కబ్జాలలో ఎలాంటి అనుమతులు లేకుండానే విలాసవంతమైన భవనాలు ఇతర ప్రైవేటు షెడ్ నిర్మాణాలు వంటివి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకునేందుకు మున్సి పాలిటీలోని కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారులకు నెలవారి ముడుపులు ముట్ట చెబుతూ మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
దీంతో ప్రతి ఏటా మున్సిపల్ వార్షిక ఆదాయం పన్నుల వసూల్లో లక్ష్యాన్ని చేరకపోవడంతో సామాన్యులు నిరుపేదలను ఇంటి వద్దకు వెళ్లి వారిని అవమానకరంగా ప్రవర్తిస్తూ ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ సినిమా హాల్లో ఫంక్షన్ హాల్ లో ఇతర ప్రైవేటు వ్యాపార షెడ్లు నిర్వాహకులు మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించకపోయిన అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి.
ప్రతినెల విధిగా పన్నులు వసూలు చేయాల్సిన వసూళ్ల చేయాల్సిన బిల్ కలెక్టర్లు ఇతర వ్యాపకాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మార్చి నెల వచ్చిందంటే ఒక్కసారిగా సామాన్యుల ఇళ్లమీదికి వసూళ్ల బాణాన్ని ఎక్కుపెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
10% పర్సంటేజీలు నెలవారి ముడుపులు.!
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ పరిధిలోని 4 మున్సిపాల్టీలలో అవినీతి, అక్ర మాలే రాజ్యమేలుతోందని తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. మున్సిపల్ శాఖ ఖజానా నింపుకోవడం కోసం నీటి ఇంటి పన్నులతో పాటు వ్యాపార, వర్తక కాంప్లెక్స్ లో సినిమా హాలు ఫంక్షన్ హాల్స్, వ్యాపార షెడ్లు, ప్రకటనలు, బ్యానర్లు, కమర్షియల్ ప్రాంతాలవారీగా పన్నులు వసూలు చేయాల్సి ఉంది.
కానీ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వ్యాపార రంగాల పలుకుబడి ఉన్న వారి నుంచి నెలవారి మామూళ్లకు కక్కుర్తి పడి మున్సిపల్ ఆదాయాన్ని పెంచే ఆలోచన మార్చారు ఫలితంగా ప్రత్యేక మార్చి నెలలో సామాన్యులపై దండయాత్ర చేసి టాక్సీలర్ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మున్సిపాలిటీలలో ప్రతి పనికి 10 శాతం పర్సంటేజీల చొప్పున భేరాసారాలతోనే పని నడుస్తోందని ప్రచారంలో ఉంది. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ప్రధాన రహదారూలకి ఆనుకొని ఉండే బ్లాక్ వన్ స్పాట్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ అంతస్థులు, భవనాలు నిర్మితమయినప్పటికీ ఇప్పటి వరకు అసెస్మెంట్ కూడా చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రతి ఏటా ఒక్కో మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమ నిర్మాణాలతో కోట్ల ఆదాయానికి గండి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయా వార్డులోని కౌన్సిలర్లు, రాజకీయ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 32,155 ఆవాస గృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 18.67 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు కేవలం 8.26 కోట్లు మాత్రమే వసూలు చేశారు. పన్నుల చెల్లింపుల్లో ఎక్కువ శాతం సామాన్యులు, నిరుపేదలుండడం విశేషం. ఈ అంశాలపై జిల్లాలోని ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం వారిని కూడా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.