calender_icon.png 16 January, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విటమిన్ డి లోపిస్తే!

16-01-2025 01:26:35 AM

వాతావరణ పరిస్థితులు, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు మనిషిని చుట్టుముడున్నాయి. పైకి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా.. లోలోపల వ్యాధుల ప్రభావం గట్టిగానే ఉంటోంది. అందుకే బలమైన శరీర నిర్మాణానికి పోషకాలు ఎంతో అవసరం. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్-డి ఒకటి. ఇది బాడీలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి తగు మోతాదులో విటమిన్-డి అందపోతే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుందంటారు వైద్యులు. 

చలికాలం తగినంత సూర్యరశ్మి ఉండదు. శరీరంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇతరులతో పోలిస్తే ఎక్కువ చలి వేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ పరిస్థితికి విటమిన్-డి లోపమే కారణం. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్-డి కీలకమై నది. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్-డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్త మై ఆ లక్షణాలు ఏమిటో గుర్తించాలి. 

-విటమిన్-డి తగ్గితే..

విటమిన్-డి లోపం అనగానే ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతమే ముందుగా గుర్తుకొస్తుం ది. కానీ దీని లోపం రకరకాల ఇబ్బందులకూ దారితీస్తుంది. నిద్ర పట్టకపోవటం, ఉత్సాహంగా పనిచేయకపోవడం వంటివి దీనికి కారణమని భావిస్తుంటారు. నిజానికి విటమిన్-డి లోపంతీవ్ర నీరసానికి కూడా దోహదం చేస్తుంది. తరచూ మూడ్ మారటం, విషయ గ్రహణ తగ్గటం కూడా విటమిన్ డి లోపం లక్షణాలే.

మెదడులో విటమిన్-డి గ్రాహకాలుంటాయి. ఇవి మూడ్‌ను ప్రభా వితం చేసే సెరటోనిన్ వంటి రసాయనాల మీదా ప్రభావం చూపుతాయి. అకారణంగా జుట్టు ఊడటమూ విటమిన్-డి లోపానికి సంకేతం కావొ చ్చు. చాలాసార్లు హార్మోన్ మార్పులు, ఒత్తిడితో వెంట్రుకలు ఊడుతున్నాయని అనుకుంటుంటా రు. కానీ విటమిన్-డి లోపిస్తే వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. అండాశయాల్లో నీటి తిత్తులు వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఇవి పరోక్షంగా సంతానం కలగటంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తికీ విటమిన్-డి తోడ్పడుతుంది. కండరాల నొప్పి, బలహీనత కూడా విటమిన్-డి లోపానికి చిహ్నం కావొచ్చు. ఇది ఇంతకు ముందులా పని చేయలేకపోవటం వంటి రూపాల్లో బయటపడుతుంటుంది. 

ఈ ఆహారంతో..

* పుట్టగొడుగులు: శాకాహారంలో అత్యధికంగా విటమిన్-డి అందేది పుట్టగొడుగులతోనే. ప్రతి వంద గ్రాముల పుట్టగొడుగుల్లో  230 నుంచి 450 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయూ) విటమిన్-డి ఉంటుంది.

* గుడ్డులోని పచ్చసొన: గుడ్లలోని తెల్ల సొన అద్భుతమైన ప్రొటీన్లకు నిలయమైతే, పచ్చ సొన విటమిన్-డి సహా ఇతర విటమిన్లకు అడ్డా. ముఖ్యంగా ఉడికించుకుని తినడం ద్వారా దీని నుంచి విటమిన్-డి బాగా అందుతుంది. ఒక్కో గుడ్డులో 40 నుంచి 50 ఐయూ మేర విటమిన్-డి ఉంటుంది.

* ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు: విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఫొర్టిఫైడ్ పాలు, పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రతి 250 మిల్లీలీటర్ల పాలు, 150 గ్రాముల పెరుగులో 100 ఐ యూ చొప్పున విటమిన్-డి ఉంటుంది. ముఖ్యం గా చిన్నపిల్లలకు ఇలా మంచి ప్రయోజనంగా ఉంటుంది.

* రోహు, హిల్సా చేపలు: మనదేశంలో విస్తృతంగా పెంచే రోహు, హిల్సా చేపల్లో ప్రతి 100 గ్రాములకు 250 ఐయూ వరకు విటమిన్-డి ఉంటుంది. చేపల ద్వారా అందే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వంటి మరెన్నో పోషకాలు కూడా అదనం.

రోజుకు ఎంత అవసరం

సాధారణంగా పెద్దవారికి, వారి వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 600 ఐయూ నుంచి 800 ఐయూ (15 నుంచి 20 మైక్రోగ్రాములు) విటమిన్-డి అవసరం. ఎదిగే పిల్లలకు ఇది మరింత ఎక్కు వగా కావాలి. శరీరంపై ఎండ పడినప్పుడు చర్మం విటమిన్-డి తయారు చేసుకుంటుంది. కానీ ఎక్కువ సేపు ఎండలో ఉంటే ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఉదయం పూట తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో కాసేపు ఎండ తగిలేలా చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంత ముఖ్యం

* గాయాలు త్వరగా మానిపోయేలా చేయడంలో విటమిన్-డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

* ఎముకలు, దంతాలను బలోపేతం 

చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ విటమిన్ అత్యవసరం.

* దీని లోపం వల్ల అలసట, కీళ్ల నొప్పులు, తరచుగా జబ్బు పడడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక లోపంగా మారితే మధుమేహం, క్యాన్సర్, రికెట్స్ వంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది.

కొన్ని పరిష్కారాలు

* ఉదయం 8 నుంచి 1౦ గంటల మధ్య 15--30 నిమిషాలు ఎండలో గడపాలి.

* ఆహారంలో చేపలు, గుడ్డు, బలవర్థకమైన తృణధాన్యాలు చేర్చుకోవాలి. 

* పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

* వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లు వాడాలి. 

* విటమిన్-డికి సంబందించిన పరీక్ష చేయించుకోవాలి. 

అతిగా వాడితే అనర్థమే

ఏదైనా తగినంత మోతాదులో ఉంటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఈ ఫార్ములా శరీరానికి అవసర మైన విటమిన్లకు కూడా సరిపో తుంది. విటమిన్-డి కోసం సప్లిమెంట్లు కూడా వాడతారు. అయితే ప్రతిదానికే అదే సమస్య అనుకుని తీవ్రం గా వాడితే చాలా నష్టపోతారు. 

* ఆకలి తగ్గడం

* బలహీనతగా మారడం

* తరచుగా మూత్ర విసర్జన

సూర్యకాంతి తప్పనిసరి

సాధారణంగా చలికాలంలో సూర్మకాంతి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చలి కారణం గా చాలామంది ఇళ్లను విడిచి బయటికి రావడానికి బద్ధకిస్తుంటారు. దీంతో విటమిన్-డి సమ స్య బారిన పడతారు. ఈ సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-డితో బాధపడేవారిలో ఎముకలు బలహీ నంగా ఉంటాయి. ఈ సమస్య ఎక్కువై చలికాలంలో విరిగే ప్రమాదమూ ఉంటుంది.

కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా సూర్యకాంతిలో గడపాలి. కనీసం పది నిమిషాలైనా ఎండ లో ఉండాలి. పిల్లలు ఈ సమస్య బారిన పడితే విటమిన్-డి డ్రాప్స్ ఇవ్వొచ్చు. పెద్దవాళ్లు అయితే వారానికి ఒకసారి కచ్చితంగా కప్యూల్స్ తీసుకోవాలి. అలాగే ఫుడ్ కూడా చాలా ముఖ్యం. సప్లిమెంట్‌గా పాలు, పుట్టగొడుగులు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చలికాలంలో ఆరుబయట వాకింగ్ అస్సలు మరవద్దు.  

డాక్టర్ పి. అవినాశ్ 

ఎంబీబీఎస్, ఎండీ,

చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఫ్యామిలీ ఫిజీషియన్

బంజారాహిల్స్, హైదరాబాద్