calender_icon.png 31 January, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

31-01-2025 12:37:14 AM

వికారాబాద్, జనవరి 30: మహిళలు లైంగిక వేదింపులకు గురవుతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని  సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ శీతల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లైంగిక వేదింపులు, మహిళల హక్కులపై కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు చట్టాలపై లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి శీతల్ అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లయితే అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీకి తమ సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. 

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, సాంఘిక మాధ్యమాల్లో అసభ్య మెసేజ్లు పోస్ట్ చేయడం, వీడియోలు పంపడం, వీడియో కాల్ చేయడం , స్క్రీన్ షాట్ లు పోస్ట్ చేయడం వంటివి కూడా లైంగిక వేధింపుల చట్టం పరిధిలోకి వస్తాయని ఆమె తెలిపారు. 

ఫిర్యాదులు చేసే క్రమంలో ఆధారాలతో కూడిన విధంగా ఉండాలని అదేవిధంగా అసత్య ఫిర్యాదులు చేయకూడదని ఆమె సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ , కలెక్టరేట్ ఏవో ఫరిహీన్,   లీగల్ ఎయిడ్ బార్ కౌన్సిల్ సభ్యులు టి.వెంకటేష్, రాము, శ్రీనివాస్, ప్యానెల్ అడ్వకేట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.