calender_icon.png 11 October, 2024 | 8:45 AM

గురిపెడితే.. ఎర పడడం పక్కా

11-10-2024 12:00:00 AM

సినిమా: వేట్టయన్: ది హంటర్ 

విడుదల తేదీ: 10 అక్టోబర్, 2024

తారాగణం: రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, అభిరామి, దుషారా విజయన్, రావు రమేశ్ తదితరులు. 

దర్శకత్వం: టీజే జ్ఞానవేల్ 

నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా 

సంగీత దర్శకత్వం: అనిరుధ్ రవిచందర్ 

సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్ ఖదీర్ 

రజినీకాంత్ నటించిన వేట్టయన్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీ ‘జైలర్‘ చిత్రం తర్వాత వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ ప్రారంభమవుతుందిలా.. 

పోలీస్ అకాడమీలో పోలీసులకు న్యాయమూర్తి సత్యదేవ్ బ్రహ్మదత్ (అమితాబ్ బచ్చన్) క్లాస్ తీసుకుంటున్న దృశ్యంతో సినిమా ప్రారంభమవుతుంది. సత్యదేవ్ బ్రహ్మదత్ ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది మొదటి సీన్‌తోనే మనకు అర్థమవుతుంది. ఎన్‌కౌంటర్లను వ్యతికిస్తూ ఉంటారు. అమితాబ్‌కు పూర్తి భిన్నమైన ఎస్పీ అథియన్ పాత్రలో రజినీ కనిపిస్తారు.

రజినీ పాత్రకు ఎలివేషన్ ఇచ్చిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ‘హంటర్’గా, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా అథియన్‌కు గుర్తింపు ఉంటుంది. శరణ్య (దుషారా విజయన్) ఒక సామాజిక బాధ్యత కలిగిన స్కూలు టీచర్ పాత్రలో కనిపిస్తుంది. ఓ నేరాన్ని కళ్లారా చూసిన శరణ్య ఈ విషయమై ఎస్పీ అథియన్‌కు లేఖ రాస్తుంది. దీంతో అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. 

ఈ క్రమంలోనే శరణ్యకు మంచి గుర్తింపు వస్తుంది. తర్వాత ఆమె ఎందుకు హత్యకు గురవుతుంది? హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? నిందితుడి నేపథ్యం ఏమిటి? అతనికి, శరణ్యకు మధ్య సంబంధం ఏమిటి? ఈ హత్య కేసులో ఎస్పీ అథియన్ ఎన్‌కౌంటర్ చేసిన వ్యక్తి నిజమైన నిందితుడేనా? ఇవన్నీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. 

నటీనటులు, సాంకేతిక బృందం గురించి.. 

మానవ హక్కులను కాపాడే అధికారిగా అమితాబ్ నటన అద్భుతం. సినిమాకు ఆయన చాలా ప్లస్ అని చెప్పాలి. ఇక రానా ఎంట్రీ సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. ఓ అకాడమీ చైర్మన్‌గా కనిపిస్తాడు. దేశంలోని ప్రతి డాక్టర్, ఇంజినీర్ తన అకాడమీ నుంచే అవ్వాలనే తపన పడే క్యారెక్టర్ తనది. రానా దగ్గుబాటికి తమిళనాట మంచి హైప్ ఇచ్చే చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు.

ఫహాద్ ఫాజిల్ పాత్రలో జీవించి నవ్వులు పూయించాడు. తార పాత్రలో మంజు వారియర్, ఏఎస్పీ రూప పాత్రలో రితికా సింగ్ మంచి నటన కనబరిచారు. డైలాగ్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అమితాబ్, రజినీ చెప్పే డైలాగ్స్ కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. రానా, రజినీల మధ్య సీన్స్ బాగా పండాయి. ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

రజినీ ‘గురి పెట్టా.. ఎర పడాల్సిందే‘ అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎక్కడా థ్రిల్ మిస్ అవకుండా దర్శకుడు చక్కగా కథ వివరించారు. అనిరుథ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి హైప్ ఇచ్చింది. నేపథ్య సంగీతం అహో అనిపిస్తుంది. పాటలూ బాగున్నాయి. 

చివరగా-

సినిమాలో చర్చించుకోదగ్గ మైనస్ పాయింట్స్ అంతగా లేవు. సెకండాఫ్ కాస్త లాగినట్టు అనిపించింది తప్ప,  మిగతా అంతా సాఫీగా సాగినట్టు అనిపిస్తుంది.