calender_icon.png 23 October, 2024 | 8:58 AM

రిజర్వేషన్లు తొలగిస్తే దేశాన్ని స్తంభింపజేస్తాం

04-05-2024 02:19:23 AM

బీసీలకు అన్యాయం చేస్తే తిరుగబాటు తప్పదు

మే 7న హైదరాబాద్‌లో బీసీల రాష్ట్ర స్థాయి సమావేశం 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి) : బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తే దేశాన్ని స్తంభింపజేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టతనివ్వాలని కోరారు. శుక్రవారం కాచిగూడలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆరెల్డీ, ఎస్పీ పార్టీలు ఆరోపిస్తున్నాయని, ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.

పదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తామని, చట్ట సభల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బీజేపీ బీసీల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణనపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని, బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా బీసీలు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మే 7న హైదరాబాద్‌లో బీసీల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించబోతున్నామని, ఈ సమావేశానికి జిల్లాలు, నియోజకవర్గాల నుంచి బీసీ ముఖ్య నాయకులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.