calender_icon.png 6 February, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథా బలం ఉన్న సినిమాలను నిర్మిస్తా..

05-02-2025 10:27:31 PM

నిర్మాత శింగనమల రమేశ్‌బాబు..

‘కొమరం పులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలను నిర్మించిన నిర్మాత శింగనమల రమేశ్‌బాబు.. అనివార్య కారణాల వల్ల 14 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన ఆయన మళ్లీ ఇప్పుడు సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు రమేశ్‌బాబు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తొలుత నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ను. సినిమాలపై ఉన్న పాషన్‌తో నిర్మాతగా మారాను. రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం మోపారు. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కూడా నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. అది తప్పుడు కేసు అని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి.

తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది. కష్టాల్లో ఉన్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్‌గా ఉన్నాడు. -నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు. -నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా. నా ఈ స్టొరీనే సినిమా కథలా ఉంది కదూ..! ఔను, వెబ్ సిరిస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్ పెట్టొచ్చు. కానీ నా కథ ఎవరు చూస్తారు..? (నవ్వుతూ). -మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న నుంచి అది నాకు వచ్చింది. ఐతే సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వంద కోట్లు పోయింది. అప్పట్లో సినిమాలు ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్దీ నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలున్నాయి.

ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని అంటున్నారు. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్‌గా చేస్తాను. -అయితే ఇన్నేళ్ల జర్నీలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే.. -24 క్రాఫ్ట్స్ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి. -కథే నా హీరో. కథను నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్ద సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం ఉంది’ అని చెప్పారు.