calender_icon.png 28 September, 2024 | 6:52 AM

కేటీఆర్ x పొన్నం

28-09-2024 03:28:48 AM

ఝూటా మాటలేల

  1. మేం నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు
  2. హైదరాబాద్‌లో లక్షల ఇండ్లు నిర్మించాం
  3. అవే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి దిక్కు
  4. కేసీఆర్ హామీలు నిజం
  5. మీ కుట్రలు, దిమాక్ లేని పనులు తేటతెల్లం
  6. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిందన్న వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఒప్పుకొన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు.

మూసీ పరీవాహకప్రాంతంతోపాటు జలవనరుల సమీపంలో పేదలు నిర్మించుకొన్న నివాసాలను హైడ్రా కూల్చివేయటంపై ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు. మాది నిర్మాణం - మీది విధ్వంసం. మావి లక్షల నిర్మాణాలు.. మీవి లక్షల కూల్చివేతలు. మూసీ నది సాక్షిగా మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు.

కాంగ్రెస్‌వి విష ప్రచారాలు, అబద్ధాలు అనడానికి మరో సాక్షం ఇదే. మేం డబుల్ ఇండ్లు కట్టకుండానే -ప్రజలను మభ్యపెట్టామని విమర్శించారు. మరి లక్ష ఇండ్లు రాత్రికిరాత్రి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టి ముఖ్యమంత్రి? మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్‌పై పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతి పోతోందా? కేసీఆర్ నిజం.. అయన హామీలు నిజం..

ఆయన మాట నిజం అని తెలిసి మిం గుడు పడటం లేదా? మీ ఝూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు నేడు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యా యి. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం.- కేటాయింపులు నిజం. మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు మాట్లాడవద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు.

ఒళ్లు దగ్గర పెట్టుకో

  1. నాలుక జాగ్రత్త
  2. ప్రజలను రెచ్చగొడితే ఊరుకోం
  3. మూసీ ప్రాంత ప్రజలకు పునరావాసం
  4. ఉపాధి అవకాశాలూ కల్పించే ప్రణాళిక
  5. ప్రజలు రాజకీయ పార్టీల భ్రమలో పడొద్దు 
  6. రవాణాశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసేటప్పుడు ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్ నేత కేటీర్‌తోపాటు ఇతర ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

శుక్రవారం సాయంత్రం సచివాలయం మీడియా సెంటర్‌లో కాంగ్రెస్ ఎంపీలు అనిల్ కుమార్, రఘువీర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలు రాజకీయ పార్టీల భ్రమలో పడొద్దని సూచించారు. మూసీ నదికి ఇరువైపులా జీవిస్తున్న ప్రజలకు పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

మూసీ, నాలాలను ఆక్రమించి కట్టిన 28 వేల ఇండ్లను కూల్చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని, దానికి సంబంధించిన వీడియోను మీడియా ముందు మంత్రి పొన్నం ప్రదర్శించారు. ఈ విషయం తెలియక కేటీఆర్, హరీష్‌రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ఆక్రమణలు తొలగించాలని గతంలో మంత్రి హోదాలో మీరు అన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు.

ఆ ప్రాంత ప్రజలకు పదివేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని బీఆర్‌ఎస్ చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల నివసిస్తున్న వారందరికీ వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. మూసీకి సంబంధించి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ను డిస్టర్బ్ చేయడంలేదని అన్నారు. పాత నగరానికి మెట్రో రానీయకుండా బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని, పదేళ్లలో హైదరాబాద్‌కు చుక్క నీరు తేలేదని ధ్వజమెత్తారు.

మూసీ పరీవాహక ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మెప్మా ద్వారా వారికి ఉపాధి కల్పించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రింగ్ రోడ్డును 7300 కోట్లకు బీఆర్‌ఎస్ నేతలు అమ్మకున్నారని విమర్శించారు. తాము హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణ జలాలను తీసుకొచ్చి నీటి కొరతను తీర్చే ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనికి, చేసిన ఖర్చుపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇల్లు మునిగితే 10 వేలు ఇస్తామని.. అవి కూడా బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన పనుల కాంట్రాక్టులకు బిల్లుల కోసం జీహెచ్‌ఎంసీ ముందు కాంట్రాక్టర్లు నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతలకు సీఎంను కలవడం ఇష్టం లేకపోతే హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తనతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ తానా అంటే బీఆర్‌ఎస్ తందాన అంటుందని విమర్శించారు. మూసీని శుద్ధి చేయడానికి రూ.5,500 కోట్లతో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటంపై ప్రభుత్వానికి బాధ్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ పేరు తెచ్చి కావాలనే రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.