ఇటీవల బీహార్‌లో పేక మేడల్లా వివిధ చిన్న వంతెనలు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. మరోవైపు ఢిల్లీ, జబల్ పూర్, రాజ్ కోట్ విమానాశ్రయాల్లో వాలు నిర్మాణాలు పడి పోవడం వంటి సంఘటనలు దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. వాటి నాణ్యతలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రకమైన సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో నిర్మితమైన అనేక వంతెనలు, ఆనకట్టలు, దేవాలయ కట్టడాలు వంటి పలు నిర్మాణాలు నేటికీ వందల సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. మరి, నేడు ఇన్నే సి సాంకేతిక సౌకర్యాలున్నా నిర్మాణాలు పూర్తయిన లేదా పూర్తి కాకుండానే కూలిపోతుండడం ఆశ్చర్యకరం. దీనికి ప్రధాన కారణం పనులు, సిమెంట్ వంటి వస్తువుల్లో నాణ్యతా లోపం.
అవినీతి, రాజకీయ ప్రమేయం పెరిగి పోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన సందర్భంగా 141 మంది మరణించారు. అప్పుడు ఎంతో హడావుడి చేసిన ప్రభుత్వం, అధికారులు ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? బీహార్‌లో రోహ్‌తాస్ జిల్లాలో ఇనుప బ్రిడ్జిని కోసి, ఇనుమును దోచేసిన దుండగులను పట్టుకున్నారా? ఇకనైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ‘ది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 250 బ్రిడ్జిలు, గత నలభై ఏళ్లలో అయితే సుమారు 2000 బ్రిడ్జిలు కూలిపోయినట్లు తెలుస్తున్నది. చిన్నా చితక వంతెనలు, బ్రిడ్జిలు, ఫుట్‌పాత్ బ్రిడ్జిలు వంటివి ఇంకెన్నో. ఇక, ఆయా ప్రాంతాల్లో నిర్మాణంలో వున్న పలు రోడ్లు పూర్తికాక ముందే పాడైపోతుంటాయి. రాళ్ళు, కంక ర బయటకు వస్తుంది. పగుళ్లు ఏర్పడుతుంటాయి. అటల్ సేతు కూ డా భారీ పగుళ్లు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఐ.ప్రసాదరావు