calender_icon.png 23 December, 2024 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిట్లైతే చదివేదెట్లా?

10-07-2024 03:55:21 AM

  • ఐదుగురు ఉండాల్సిన గదిలో పదిమంది
  • టీచింగ్, నాన్ పోస్టులు ఖాళీ
  • రెగ్యులర్ వీసీ లేక కుంటుపడుతున్న పాలన
  • బోధనను వదిలి పాలనపైనే ప్రొఫెసర్ల దృష్టి

యూనివర్సిటీలో సీటు వచ్చిందంటే చాలు విద్యార్థులు తమ జీవితం బంగారుమయం అవుతుందని భావిస్తారు. అనుభవమున్న ప్రొఫెసర్లతో విద్యాబోధన ఉంటుందని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండి చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటారని అనుకుంటారు. కానీ, నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ఇందుకు భిన్నంగా ఉన్నది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులను అక్కడి పరిస్థితులు వెక్కిరిస్తున్నాయి. వసతుల లేమి, నిధుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదుగురు ఉండాల్సిన గదిలో దాదాపు పది మంది విద్యార్థినులు ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు లేక ఉన్నా.. పాలనాపరమైన పదవులతో వారికి తీరిక లేకపోవడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు.

నిజామాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణ వర్సిటీలోని బాయ్స్, లేడీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేడీస్ హాస్టల్‌లో ఐదుగురు ఉండాల్సిన గదిలో పదిమంది కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్‌లో సైతం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న గదుల్లో పెచ్చులూడి అనేకసార్లు మీద పడడంతో విద్యార్థులకు గాయాలవుతున్నాయి. హాస్టళ్లలోని టాయిలెట్లు శుభ్రంగా లేక, బాత్‌రూంలకు తలుపు లు లేకపోవడంతో విద్యార్థులు బయట గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 

పీహెచ్‌డీ విద్యార్థులకు గదులే లేవు

పీహెచ్‌డీ విద్యార్థులకు గదులు కేటాయించడం లేదు. అడ్మిషన్ సమయంలో గది తీసుకోనని అఫిడవిట్ ఇస్తేనే పీహెచ్‌డీ సీటు కేటాయిస్తున్నారు. ఈ అఫిడవిట్లు ఇవ్వడమేంటని వారు ఆశ్చర్యపోతున్నారు.

భోజనంలో బల్లులు, కప్పలు

హాస్టల్ గదుల్లో ఎలాగోలా సర్దుకుని విద్యార్థులు ఉంటున్నా.. కనీసం నాణ్యమైన భోజనం కూడా అందడం లేదు. దీంతో విద్యార్థులు ఆకలికి అలమటిస్తూ, ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భోజనంలో బల్లి రావడంతో మెస్‌లో భోజనం చేసేందు కు విద్యార్థులు జంకుతున్నారు. గతంలోనూ ఓసారి భోజనంలో కప్ప వచ్చింది. 

ఫీజుల వసూలులో ప్రైవేటుతో పోటీ

సౌకర్యాల కల్పనలో నాసిరకంగా ఉంటు న్న ఈ వర్సిటీ, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో మాత్రం ప్రైవేటు వర్సిటీలతో పోటీ పడుతున్నది. వర్సిటీలో ఏటా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు పెంచుతున్నారని విద్యార్థులు చెప్తున్నారు. మెస్ బిల్లు లో సైతం విద్యార్థులు భోజనానికయ్యే ఖర్చు కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. 

కాలం చెల్లిన కోర్సుల బోధన

వర్సిటీలో ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, లా, ఎడ్యుకేషన్ విద్యల్లో మొత్తం 31 రకాల కోర్సులున్నాయి. వాటిలో 1,095 సీట్లున్నాయి. ఎక్కువ శాతం కోర్సులు ఆరంభంలో ప్రారంభించినవే. ప్రస్తుత పరిస్థితుల కు తగ్గట్టు కోర్సులు లేకపోవడంతో విద్యార్థులు వాటిపై ఆసక్తి కనబరచడం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా కోర్సులు ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. 

ఇన్‌చార్జి వీసీలతోనే పాలన

2006లో ఏర్పాటు చేసిన ఈ వర్సిటీలో 18 ఏళ్లు గడుస్తున్నా ఇన్‌చార్జి వీసీలతోనే పాలన కొనసాగుతున్నది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో అధ్యాపకులే ఒకరి తర్వాత ఒక రు ఇన్‌చార్జి వీసీగా, రిజిస్ట్రార్‌గా ఇతర పాలనాపరమైన పదువులు నిర్వహిస్తూ, టీచింగ్ ను నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో చాలా మంది ప్రొఫెసర్ల విద్యార్హతలపై తోటి అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు సందేహాలు లేవనెత్తారు. ఫేక్ సర్టిఫికెట్లతో వర్సిటీలో చేరారని, వారి సర్టిఫికెట్లపై దర్యా ప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో అధిక సంఖ్యలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరగా భర్తీచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 

రాజకీయాలు చేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ

యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ విద్యాబోధన కన్నా రాజకీయాలు చేయడంపైనే దృష్టి పెడుతున్నది. తరగతులు ఎగ్గొట్టి పాలనాపరమైన విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా తరగతులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌డీ స్కాలర్లకు హాస్టల్ నిర్మించాలి. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి. 

 డాక్టర్ కర్క గణేశ్, డీఎస్‌యూ నాయకుడు, టీయూ

సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం

యూనివర్సిటీలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు మేము ప్రాధాన్యమిస్తున్నాం. హాస్టళ్లలో మరమ్మతులు చేయించాము. విద్యార్థులకు సరిపడా హాస్టల్ గదులున్నాయి. విద్యార్థినులకు మాత్రం హాస్టళ్లలో గదుల కొరత ఉన్న మాట వాస్తవం. రూసా కింద కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.7 కోట్లు విడదలయ్యాయి. రెగ్యులర్ వీసీ వచ్చాక టెండర్లు పిలిచి లేడీస్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేస్తాం. కోర్సులను ఫుల్ టైం కోర్సులుగా మార్చి, ఫ్యాకల్టీని నియమించాలని ప్రభుత్వానికి నివేదించాం. యునివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. 

 యాదగిరి, ప్రొఫెసర్(రిజిస్ట్రార్), టీయూ