- ఎమ్మెల్యే వీరేశం అనుచరుల ఫోన్లు ట్యాప్ అబద్ధం
- మీడియాలో ఎక్స్‌పోజ్ అయ్యేందుకు తప్పుడు ప్రచారం
- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- ఫోన్‌ట్యాపింగ్ కేసులో పోలీసు విచారణకు హాజరు
- అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌పై ప్రశ్నల వర్షం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. విచారణలో ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన ఫోన్ కాల్స్‌పై పోలీసులు సుధీర్ఘంగా విచారించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులైన మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్లు ట్యాప్ చేయడంపై పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేసినట్టు వచ్చిన రిపోర్టును లింగయ్య ఎదుట పెట్టి ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. విచారణ పూర్తయ్యాక చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు.
తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడానని చెప్పారు. మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్ నంబర్లు కావాలని తిరుపతన్న అడిగారని, వారిద్దరి ఫోన్ నంబర్లు తన అనుచరుల వద్ద తీసుకొని ఇచ్చానని పేర్కొన్నారు. నంబర్లు ఎందుకని తిరుపతన్నను ప్రశ్నిస్తే.. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుంది అని మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేశారని గుర్తుచేశారు.
విచారణాధికారులు కూడా తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే ప్రశ్నించారని వెల్లడించారు. ఎమ్మెల్యే వీరేశం అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారనేది అవాస్తవమని, మీడియాలో ఎక్స్‌ఫోజ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది తనపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని లింగయ్య పేర్కొన్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసులకు సహకరిస్తానని, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే తనను విచారించారని భావిస్తున్నానని, తన స్టేట్మెంట్‌ను వీడియో రికార్డ్ చేశారని లింగయ్య వివరించారు. ఇదిలాఉండగా చిరుమర్తి లింగయ్య విచారణ కొనసాగుతుండగానే, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు రావడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను కూడా సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం.
రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులు : చిరుమర్తి
రాజకీయ కుట్రలో భాగంగానే తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన నోటీసులు ఇచ్చారని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం సిట్ విచారణకు వచ్చే ముందు చిరుమర్తి నార్కట్‌పల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణకు హాజరవుతానని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్తానని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నోటీసులపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. జిల్లాలో పనిచేసిన పోలీసు అధికారులతో మాట్లాడి ఉండవచ్చునని, అలాగే పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం ఎమ్మెల్యేలు పోలీసులతో మాట్లాడటం సహజమేనని అన్నారు.