calender_icon.png 18 January, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాట్లప్పుడు డబ్బులడిగితే.. ఓట్లప్పుడు ఇస్తారు!

18-01-2025 01:33:51 AM

  1. ఏ ఊర్లోనైనా 100 శాతం రుణమాఫీ అయితే అందరం రాజీనామా చేస్తాం
  2. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్

చేవెళ్ల, జనవరి 17(విజయక్రాంతి): కేసీఆర్ నాట్లేసేటప్పుడు రైతుబంధు డబ్బులిస్తే రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఊరిలోనైనా 100 శాతం రుణమాఫీ అయ్యిందని రైతులు రాసిస్తే మొత్తం బీఆర్‌ఎస్ పార్టీ నేతలంతా రాజీనామా చేస్తామని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

శుక్రవారం చేవెళ్ల నియోజవర్గంలోని షాబాద్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీ సీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోయి ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేశామని చెబుతున్నాడని ఇది ఈ ఏడాదిలోనే పెద్ద జోక్ అని విమర్శించారు.

ఒక్క ఊర్లనైనా రైతులు రుణమాఫీ పూర్తయ్యిందని చెబితే రాజీ నామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి ముఖం మీదనే చెప్పానని గుర్తుచేశారు. కేసీఆర్ రైతులకు బిచ్చం ఏసినట్లు ఎకరాకు 10 వేలు ఇస్తున్నారని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే 15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారని, ఒక్క రూపాయన్న ఇచ్చిండా.. అని కేటీఆర్ అడిగారు.

ఎన్నికలకు ముందు కేసీఆర్  రైతుబంధు కింద రూ.7,600 కోట్లు రైతు అకౌంట్లలో వేయబోతే.. ఈసీకి లేఖ రాసి ఆపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డబ్బులనే  పార్లమెంట్ ఎన్నికలకు ముందు రైతుల అకౌంట్లలో వేశారని, వానాకాలం రైతుబంధు మాత్రం ఎగ్గొట్టాడని ఆరోపించారు. 

రైతులను జైలుకు పంపిన సీఎం

కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మాకు కావాలని అడిగిన పాపానికి 40 మంది రైతులను జైళ్లో పెట్టించారని,  హీర్యా నాయక్ అనే రైతుకు గుండె పోటు వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారని మండిపడ్డారు. రైతుల పక్షాన పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని 37 రోజులు జైలుకు పంపించారని, రైతుల కోసం ఆయన మరో 40 రోజులైనా జైలుకు పోయేందుకు సిద్ధమని అంటుండన్నారు. ఆయనే కాదు తాను కూడా చెబుతున్నానని 37 రోజులే కాదు... 365 రోజులు జైళ్లో పెట్టినా భయపడేది లేదన్నారు. 

రైతులు, మహిళలకు బాకీ పడ్డ సీఎం

డిసెంబర్ 3 తర్వాత ఎకరాకు 15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... వానాకాలం రైతుబంధు ఎకరాకు 7500 చొప్పున బాకీ ఉన్నాడన్నారు.  మహిళలకు నెలకు  రూ.2,500 చొప్పున ఏడాదికి 30 వేలు, పెళ్లిళ్లు అయిన 5 లక్షల మంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నాడన్నారు.

ముసలోళ్లను కూడా మోసం చేశాడని, ఇంట్లో ఒక్కొరికి కేసీఆర్ 2 వేల ఫించన్ ఇస్తే ఇంట్లో ఇద్దరికి రూ. 4 వేల చొప్పున ఇస్తామని చెప్పి మాట తప్పాడని మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి..

అమలు చేయకుండా మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, వాళ్ల నేత రాహుల్  గాంధీ, కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టాలన్నారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే.. హామీలు ఏమైనయ్ బిడ్డా.. అని నిలదీయాలని పిలుపునిచ్చారు.

మందికి పుట్టిన బిడ్డలను మా పిల్లలని అంటున్నరు

కేసీఆర్ ఇచ్చిన 44 వేల ఉద్యోగాలను కూడా ఆయనే ఇచ్చానని ఢిల్లీలో చెప్పుకుంటున్నాడని కేటీఆర్ అన్నారు. రైతుభరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి.. జనవరి 26 నుంచి 12 వేలు ఇస్తామంటున్నారని. ఎన్నికల్లో చెప్పినట్లు 15 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మందికి 100 శాతం రుణమాఫీ, 22 లక్షల మంది కౌలు రైతులకు రూ.12 వేల చొప్పున, భూమి లేని రైతులకు కూలీలకు 12 వేల చొప్పున ఇవ్వాలని అన్నారు.  రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా హామీల అమలు కోసమే రైతు ధర్నా చేపట్టామని, ఇది ఆరంభమేనని.. 21న నల్లగొండలో, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. 

కేటీఆర్‌ను జైలుకు పంపేందుకు సీఎం కుట్ర: ఆర్‌ఎస్పీ

మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను జైలుకు పంపించాలని ప్రతిక్షణం కుట్ర పన్నుతున్నారని ఆరోపిం చారు. ప్రజలను మోసం చేసినోళ్లను, రైతుల భూములు గుంజుకుంటునోళ్లపై జైళ్లో పెట్టాల్నా.. ప్రపంచంలో ఏడు దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్మూలా- ఈ ని మన దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపి న కేటీఆర్‌ను జైళ్లో పెట్టాల్నా అని ప్రశ్నించారు.

అంతకుముందు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఢిల్లీలో కూర్చొని రుణమాఫీ చేశామని చెబుతున్నారని, ఇక్కడే కుమ్మరి గూడకు చెందిన చెన్నమ్మ 54 వేల రుణం అలాగే ఉందని అంటున్నారని, ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, అంజయ్య యాదవ్, మహేశ్వర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.