నటీనటులు ఎక్కడికెళ్లినా బాడీగార్డ్‌లతోనే వెళుతుంటారు. కొన్నిసార్లు బాడీగార్డ్స్ అవసరం లేకున్నా సరే.. సెలబ్రిటీలు వెంట తీసుకెళతారు. దీనికి కారణాన్ని తాజాగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘ఫతేహ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ఆయన సెలబ్రిటీల బాడీగార్డ్స్ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. “కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే కొంతమంది నటులు బాడీగార్డ్స్‌ను పెట్టుకుంటారు. ఓసారి నా స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణించినప్పుడు మా పక్కన ఉన్న కారులో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు.
అక్కడ ఎవరూ లేరు. అయినా సరే.. పక్కకు జరగండంటూ అతని బాడీగార్డ్ కొంత హడావుడి చేశాడు. వాస్తవానికి బాడీగార్డ్స్ హడావుడి లేకుండా సెలబ్రిటీ ఎవరైనా షాపింగ్ మాల్ లేదంటే హోటల్‌కు వెళితే ఎవరూ పట్టించుకోరు. అందుకే అవసరం లేకున్నా హడావుడి చేస్తుంటారు. నాకు బాడీగార్డ్స్ ఉన్నారు. కానీ పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, చేయి చేసుకోవద్దని ముందుగానే చెబుతాను” అని సోనూసూద్ తెలిపారు.