calender_icon.png 29 November, 2024 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధారాలు లేకపోతే అంతే

27-10-2024 12:45:29 AM

  1. మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు 
  2. రూ.50 వేలకు మించి నగదు, బంగారంతో వెళ్తే సరైన పత్రాలు తప్పనిసరి 

సంగారెడ్డి, అక్టోబర్ 2౬ (విజయక్రాంతి): మహారాష్ట్రలో నవంబర్ 20న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసులు పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నగదు, బంగా రం, వెండి తదితరాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేస్తున్నారు.

తెలంగాణకు మహారాష్ట్ర సరిహద్దు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణకు, మహారాష్ట్రకు మధ్యలో కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్, బస్వకల్యాణ్ పట్టణాలు ఉన్నాయి. బస్వకల్యాణ్ సమీపంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దు కంగ్టి మండలానికి సమీపంలో ఉంది.

65వ నంబర్ జాతీయ రహదారి నుంచి ప్రతిరోజు వ్యాపారులు, ఉద్యోగులు ముంబాయికి ప్రయాణం చేస్తుంటారు. 65వ జాతీయ రహదారిపై మహారాష్ట్రలోని ఉమర్గ పట్టణం ఉంది. అక్కడ సమీకృత చెక్‌పోస్ట్ ఉంది. దీంతో 24 గంటల పాటు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రతిరోజు మహారాష్ట్రలోని తుల్జపూర్ భవానీ మాత ఆలయానికి దర్శనం కోసం భక్తులు వెళ్తుంటారు.

ఈ క్రమంలో వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా రూ.50 వేలకు మించి నగదు, పెద్ద మొత్తంలో బంగారం, వెండి తదితర నగలు ఉంటే  అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఎక్కువగా బంగారం, వెండి ముంబాయిలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తారు.

వీటితో పాటు ముంబై నుంచి హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డికి చెందిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్తారు. ఇటీవల మహారాష్ట్ర సరిహద్దులో వాహనాలు తనిఖీ చేయగా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు సంబంధించిన నగదు పట్టుబడినట్లు తెలిసింది. దీంతో ముంబై వెళ్లేవారు సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.