calender_icon.png 21 September, 2024 | 5:58 AM

ఎల్‌ఆర్‌ఎస్‌పై సందిగ్ధత వీడితే జోరుగా నిర్మాణాలు

28-07-2024 02:30:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (విజయక్రాంతి): ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.44లక్షల దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో మున్సిపాలిటీల నుంచి 10.13 లక్షల మంది , పంచాయతీల నుంచి 10.74 లక్షల మంది, కార్పొరేషన్ల నుంచి 4.13 లక్షల మంది దరఖాస్తులను సమర్పించారు. ప్రస్తుతం కోర్టు కేసుల కారణంగా ఈ దరఖాస్తులు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

వీరు గతంలో క్రమబ ద్ధీకరణ కోసం రూ.1000 చెల్లించి దరఖాస్తులను సమర్పించారు. రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టిసారించింది. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్షించిన మంత్రులు పాత దరఖాస్తులను పరిష్కరించడంతోపాటు కొత్త ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి విధివిధానాలను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రజల్లో సదాభిప్రాయం రావడంతోపాటు ప్రభుత్వానికి వందల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు. ఎల్‌ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం జరిగితే నగరంతో పాటు నగర శివారులో ప్లాట్లు కలిగి ఉన్న కొన్ని లక్షల మంది ఇండ్ల నిర్మాణం చేసుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇంటి స్థలాలపై వీడని సందిగ్ధత

రియల్ వెంచర్లలో ఇంటి స్థలాలకు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సందిగ్ధత కొనసాగుతోంది. లేఅవుట్లలో విక్రయించని ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. వెంచర్లలో అప్పటికే ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులకు అదనంగా 33 శాతం కాంపౌండ్ ఫీజు సైతం చెల్లించాల్సి ఉంటుందని రియాల్టీ రంగ నిపుణులు చెప్తున్నారు. అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనను అమలు చేయడంతో కొత్త లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు 2020 సెప్టెంబరులో బ్రేక్ పడింది. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రియాల్టర్లలో ఉత్కంఠ నెలకొంది. 

1,337 అక్రమ లేఅవుట్లు...

హెఎండీఏ పరిధిలోని ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లలో సుమారు 1,337 ఇలాంటి అక్రమ లేఅవుట్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 628 లేఅవుట్లు క్రమబద్ధీకరణకు అర్హత కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిల్లో 1.31 లక్షల ప్లాట్లు ఉండగా, 40 వేల పైచిలుకు ప్లాట్లు నేటి వరకు విక్రయించలేదు. వీటికి ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం కల్పించడం వల్ల భవిష్యత్తులో నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,200కు పైగా ఇంటి స్థలాలకు సంబంధించిన వెంచర్లు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే అసైన్డ్, శిఖం, ఎఫ్‌టీఎల్ ఆక్రమించిన భూముల్లో లేఅవుట్ల్ల కోసం హెఎండీఏకు దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. ఇలాంటి లేఅవుట్లను ఎల్‌ఆర్‌ఎస్  కోసం పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ షురూ అవుతుందని అధికారిక వర్గాల సమాచారం.