calender_icon.png 27 April, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ జలాలు వెళ్లకపోతే..

25-04-2025 12:55:45 AM

పాక్‌ను ఊహించని దెబ్బకొట్టిన భారత్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ 1960లో జరిగిన సింధూ నది ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సింధూ జలాలు పాక్ రైతాంగానికే కాదు అక్కడి పౌరుల తాగునీటికి కూడా చాలా అవసరం. సింధూ దాని ఉపనదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటూ వస్తున్నాయి. సెప్టెంబర్ 19 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది.

సింధూ, జీలం, చీనాబ్ నదుల నీటికి పాక్ వాడుకుంటోంది. తొమ్మిదేండ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.  భారత తొలి ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని ఆయుబ్ ఖాన్ ఈ ఒప్పందం మీద సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని, పాకిస్తాన్ సింధూ, జీలం, చినాబ్ నదుల నీటిని వాడుకుంటున్నాయి. గతంలో యుద్ధాలు జరిగిన సమయాల్లో కూడా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు.

ఈ సారి మాత్రం ఒప్పందం రద్దు చేస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ ఒప్పందం ప్రకారం పాక్‌కు ఈ నదుల నుంచి 80 శాతం నీళ్లు లభిస్తున్నాయి. పాకిస్తాన్‌లో 23.7 కోట్ల మంది  నీటిని వాడుకుంటారు. ఈ మూడు నదుల కింద పాక్‌లో 16 లక్షల హెక్టార్లు వ్యవసాయ భూమి సాగవుతుంది. ఆ దేశ జీడీపీకి ప్రధాన వనరుగా ఉన్న వ్యవసాయం అధిక భాగం ఈ నదుల నీళ్ల మీదే ఆధారపడి ఉంది. 

ఒప్పందం ఎందుకు జరిగిందంటే.. 

సింధూ నది టిబెట్‌లోని మానససరోవరంలో జన్మించి అక్కడి నుంచి భారత్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, చైనాలోని కొన్ని భాగాల్లో ప్రవహిస్తుంది. 1948లో భారత్ సింధూ నది జలాలను పాక్‌కు వెళ్లకుండా చేసింది. దీంతో పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో ఈ సమస్యను లేవనెత్తింది. ఐక్యరాజ్య సమితి సిఫారసులతో ప్రపంచబ్యాంకు ఈ సంధికి మధ్యవర్తిత్వం వహించింది.

సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు నిర్ణయం భవిష్యత్‌లో పాక్‌కు ఎక్కువ నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  భారత్ ఈ విధంగా చేయడం వల్ల పాక్‌కు ఈ నదుల ద్వారా చుక్క నీరు కూడా లభించదు.