జరిమానాలు రెట్టింపు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దీపావళి మోతలతో దేశం దద్దరిల్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ సామాన్య జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తద్వారా ఢిల్లీలో వాయు నాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వాహనదారులతో పాటుగా ఢిల్లీ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
వాయు నాణ్యత ఇంతలా దిగజారి పోవడానికి దీపావళి బాంబులతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఓ కారణమే అనే వాదనలు వినవస్తున్నాయి. దీంతో ఈ పరిస్థితిపై కేంద్రం అప్రమత్తమైంది. పంట వ్యర్థాలు కాల్చేవారికి విధిస్తున్న జరిమానాలను రెట్టింపు చేసింది.
నిబంధనలు ఇలా..
కొత్త నిబంధనల ప్రకారం రెండకరాల కంటే తక్కువ భూమి ఉన్న అన్నదాతలు వ్యర్థాల్ని దహనం చేస్తే వారికి రూ. 5,000.. రెండు నుంచి ఐదెకరాల మధ్య భూమి ఉన్న అన్నదాతలకు రూ. 10,000 జరిమానా, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు వ్యర్థాల దహనానికి పాల్పడితే రూ. 30,000 జరిమానా విధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది.