ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి
ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకందార్లకు అవగహన సదస్సు
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): దూల్పేట్ లో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని, లేదంటే ఇకనుంచి కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి హెచ్చరించారు. బుధవారం ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకందార్లకు రహీంపూరలోని గౌడ మఠంలో అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖురేషి మాట్లాడుతూ.. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ధూల్‌పేట్ వాసులు సంస్కృతిని మరిచి నిన్న నాటుసారా తయారీ, నేడు గంజాయి అమ్మకాలు చేపట్టడం దురదృష్టకరమన్నారు. గంజాయిని అమ్మకాలు పూర్తిగా నిలిపి వేయాలని జాయింట్ కమిషనర్ సూచించారు. ఇప్పటి వరకు కేసులు అరెస్టులతో కొనసాగించామని, రెండో పేతిస్‌లోకి దిగితే కేసులతో పాటు ఆస్తుల జప్తుకు దిగాల్సి ఉంటుందని అన్నారు.
గంజాయి అమ్మకాలపై ప్రభుత్వం చాల సీరియస్ ఉందని, గంజాయి అమ్మకాలను ధూల్‌పేట్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేది లేదని జాయింట్ కమిషనర్ ఖురేషీ స్పష్టం చేశారు. గంజాయి అమ్మకాలను నిలిపి వేయకుంటే దాడులను మరింత ముమ్మరం చేస్తామని, ఎవ్వరిని వదిలి పెట్టెది లేదని ధూల్‌పేట్ ఇంచార్జీ నంద్యాల అంజి రెడ్డి అన్నారు. గంజాయి అమ్మకాలను ధూల్‌పేట్‌లో పూర్తిగా నిలిపి వేస్తామని, ఇప్పటికే చాల మందిని మానివేశామని అన్నారు. గంజాయి అమ్మకాలపై జీవించే పేదవారి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలని చాలామంది కోరారు. గంజాయి పూర్తిగా నిలిపివేస్తే ప్రభుత్వ పేదలకు చేయూత అందించడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పరమేశ్వరీ అన్నారు. ఈ సమావేశంలో అసిస్టేంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, సీఐలు మధూబాబు, గోపాల్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కోటమ్మలు సిబ్బంది ఉన్నారు.