calender_icon.png 30 October, 2024 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామూళ్లు ఇవ్వకుంటే ఫైళ్లు కదలట్లే!

14-09-2024 12:00:00 AM

  1. రిజిస్ట్రేషన్లు చేయడం లేదని జనగామ రియల్టర్ల ఆందోళన 
  2. కావాలనే బురద చల్లుతున్నారన్న సబ్ రిజిస్ట్రార్

జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రియల్టర్లు శుక్రవారం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. నెల రోజుల క్రితం ఇక్కడ ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగినప్పటికీ ఈ అధికారి మాత్రం అనేక సాకులు చూపించి ఫైల్లు ముట్టుకోవడం లేదని రియల్టర్లు ఆరోపిస్తున్నారు.

నాలా కన్వర్షన్ అయినవి, పార్ట్ ఆఫ్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పించుకుంటున్నారని వాపోయారు. మరోవైపు మామూళ్లు ముట్టజెప్పిన ఫైళ్లను మాత్రమే కదిలిస్తున్నారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ప్లాట్లు, ఇండ్ల కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

నిబంధనల ప్రకారం వెళ్తున్నందుకే ఆరోపణలు నాన్ అప్రూవుడ్ లేవుట్లలోని అక్రమ ప్లాట్లను మాత్రమే తాము తిరస్కరిస్తున్నామని సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ స్పష్టంచేశారు. తాను నిబద్ధతతో పనిచేస్తున్నందుకే కొందరు అక్రమార్కులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రియల్టర్లు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు.