calender_icon.png 29 November, 2024 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తే ఊరుకోం

29-10-2024 02:30:54 AM

బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించిన ఊరుకునే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌పై పోలీసుల రైడ్‌ను ఉద్ధేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియాతో మాట్లాడారు.

చట్టంలో ఉన్న విధంగా ఫంక్షన్‌లు, కార్యక్రమాలు చేసుకోవచ్చని, ఫంక్షన్‌లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఫాంహౌసుల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం, మంత్రులకు అవసరం లేదని, కేవలం అక్కడ జరుగుతున్న అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారని స్పష్టం చేశారు.

అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికగా కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైందని పేర్కొన్నారు. మేం వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదని, కానీ పోలీసులు కేసు నమోదు చేసింది కేటీఆర్ బావమరిదిపైన కావడంతో మీడియా అట్రాక్ట్ అయిందన్నారు.

ఈ అంశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, దీంతో పోలీసులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుందని వెల్లడించారు. ఈ అంశంలో పోలీసులు ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజల దృష్టి మరల్చడానికే కక్షసాధింపు చర్యలని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలని, ఎంపీ ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలుంటాయని, జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలుండవని స్పష్టం చేశారు. ఎలాంటి అశ్లీలత లేకుండా, మాదకద్రవ్యాలకు తావు లేకుండా, మద్యపానం అనుమతులు తీసుకుని పార్టీలు చేసుకోవచ్చని సూచించారు.