- క్రమంగా తగ్గుతున్న పత్తి ధరలు
- మొన్నటి వరకు రూ.8 వేలు, ప్రస్తుతం రూ.6,300
- పత్తి ధర తగ్గడంపై అన్నదాతల ఆందోళన
- ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని విన్నపం
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): చేతికొచ్చిన పత్తి పంటను అమ్ముకుందామని భావిస్తున్న రైతులు.. క్రమంగా తగ్గుతున్న ధరలతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి రాకముందు మంచి ధర ఉండగా, తీర అమ్ముదామనుకుంటే గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో అన్నదాతలు ఈ ఏడాది కూడా అప్పులు నుంచి బయటపడేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు రూ.8,100 ఉన్న పత్తి ధర తాజాగా రూ.6,300 కు పడిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని దిగులు పడుతున్నారు. ప్రభుత్వం రూ.7 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 42.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 25.33 లక్షల టన్నుల పత్తి దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి భారీ వర్షాల నేపథ్యంలో పత్తిపంట పూత, పిందె సమయంలో కొంతమేర దెబ్బతింది. దిగుబడి కూడా ఆశించిన మేర వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు అంతంత మాత్రమే
పత్తి అమ్మకాల కోసం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రతి మండలానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కానీ పత్తి మార్కెట్‌లోకి వచ్చి వారం రోజులు గడిచినా అంతంత మాత్రంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉన్నచోటా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో కేంద్రాలకు వెళ్లేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.
రైతుల చుట్టూ దళారులు
పత్తిపంట చేతికి రావడంతో రైతు లు మార్కెట్‌కు వెళ్లకుండా దళారులు వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధర కంటే రూ.500 ఎక్కువ ఇస్తామని, తేమ శాతం, రంగు మారినా కొనుగో లు చేస్తామని నమ్మబలుకుతున్నారు.
దీంతో కొందరు దళారుల వైపు మొగ్గుచూపుతున్నారు. నారాయణపేట జిల్లా లో రైతులను దళారులు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయం అధికారులకు తెలియడంతో అవగహన కల్పిస్తున్నారు. దళారులకు అమ్మితే తూకాల్లో మోసం చేస్తారని రైతులకు వివరిస్తున్నారు.