calender_icon.png 30 September, 2024 | 4:53 AM

కూల్చివేతలపై సమీక్షించుకోకుంటే పోరాటమే

30-09-2024 02:50:07 AM

మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై దాడులు

బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

సేవా పక్వాడ్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): పేదల ఇండ్లపై హైడ్రా దాడుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించుకోకుంటే బీజేపీ తెగించి కొట్లాడానికి సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నా రు. ప్రజల ఇండ్లపై బుల్డోజర్లు దిగాలంటే ముందుగా బీజేపీ కార్యకర్తలను, మమ్ముల్ని తాకాలన్నారు.

బర్కత్‌పురాలోని బీజేపీ నగర కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వ ర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సేవా పక్వాడ ఫొటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యు లు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షులు గౌతమ్‌రావుతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా.. ఏ వ్యక్తిని కదిలించినా హైడ్రా దాడుల గురించే చర్చ జరుగుతుందన్నారు. పేదల ఇళ్లు కూలుస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు పునఃసమీక్షించుకోవడం లేదో.. అర్థం కావడం లేదన్నారు.

పైగా.. ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తుందన్నారు. కొత్త ఇల్లు కట్టుకొ ని గృహప్రవేశం చేస్తే.. ఆ ఇల్లు తోరణాలు వాడకముందే కూల్చేస్తున్నారన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వ తీరు వల్ల హైదరాబాద్‌లో రియ ల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందన్నారు. ఈ విధానాలను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న ట్లు తెలిపారు.

పేదల ఉసురు తీసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా అని తీవ్రంగా మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయకుం డా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. పేదలు కన్నీళ్లు పెడుతుంటే మీకు కన్పించడం లేదా.. ఇక మీకు.. బీఆర్‌ఎస్‌కు తేడా ఏముందంటూ రాష్ట్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకుండా బీఆర్‌ఎస్ మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందన్నారు. 

కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వాపోయారు. ఇప్పు డు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తున్నారన్నారు. పేదల ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు, ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు.